Congress Election Campaign in Telangana : లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది.సార్వత్రిక సమరంలో అత్యధిక లోక్‌సభ ఎంపీలు గెలుచుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ కార్మికులకు ఏం చేయకుండా ఓటు అడిగే నైతికహక్కు లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్ధపల్లి జిల్లా రామగిరి మండలం ఒసిపి 2 బొగ్గు ఉపరితలగని గేట్ మీటింగ్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణతో కలసి పాల్గొన్నారు.
Minister Sridhar Babu Election Campaign In Peddapalli: ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఆదాయపు పన్ను స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువకుడు పారిశ్రామికవేత్త అయిన వంశీకృష్ణ మన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, అందుకే ఆయనకు మద్దతు తెలిపాలని మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి కార్మికులను కోరారు.