Tax Benifits On Personal Loan : డబ్బుతో ఎవరికి, ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో చెప్పలేం. చేతిలో డబ్బులు లేనప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే చాలా మంది పర్సనల్ లోన్ వైపు చూస్తారు. అయితే పర్సనల్ లోన్స్ అన్సెక్యూర్డ్ రుణాలు. అంటే మీరు ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణం పొందొచ్చు. ఇతర లోన్లతో పోలిస్తే, పర్సనల్ రుణాలు కాస్త సులువుగా మంజూరు అవుతాయి. అలాగే పర్సనల్ లోన్స్ తో కొన్ని పన్ను మినహాయింపులను పొందొచ్చు. అవేంటంటే?
పర్సనల్ లోన్‌ను ఆదాయ ఆర్జన, పెట్టుబడుల కింద భావించరు. అందుకే పర్సనల్ లోన్‌పై డైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. అయితే కొన్ని సందర్భాల్లో, భారత ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం నిర్దిష్ట అవసరాలకు పర్సనల్ లోన్‌ను ఉయోగిస్తే, ట్యాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇల్లు కొనుగోలు, రిపేర్ కోసం పర్సనల్ లోన్ :
ఇల్లు కొనడం, నిర్మించడం, రిపేర్ చేయడం కోసం వ్యక్తిగత రుణాన్ని తీసుకుంటే- వడ్డీ చెల్లింపుపై డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 24(బీ) కింద మినహాయింపు పొందొచ్చు. ఈ సెక్షన్ కింద ఏటా రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు.
విద్య కోసం పర్సనల్ లోన్
పిల్లల చదువు కోసం పర్సనల్ లోన్ తీసుకుంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈ కింద వడ్డీపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఈ మినహాయింపు గరిష్ఠంగా ఎనిమిదేళ్ల వరకు లేదా లోన్ పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ఉంటుంది. ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకున్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
బిజినెస్ కోసం పర్సనల్ లోన్ :
బిజినెస్ కోసం పర్సనల్ లోన్ డబ్బులు ఉపయోగిస్తే పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. లోన్‌పై చెల్లించిన వడ్డీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు పన్ను విధించిన ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు.
ఇవి తప్పనిసరి
పర్సనల్ లోన్ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు దేనిపై లోన్ తీసుకుంటున్నారో అందుకు తగ్గట్లు డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే లోన్‌పై పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఉదాహరణకు : మీరు ఇంటిని నిర్మించడం లేదా కొనుగోలు చేయడం కోసం రుణం తీసుకోవాలనుకుంటే హోమ్ లోన్ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే హోమ్ లోన్ అయితే రుణం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నామో నిరూపించుకోవడం సులభమవుతుందని తెలిపారు.