తెలంగాణ

telangana

ETV Bharat / politics

కేసీఆర్ లక్కీ నంబర్​ నా దగ్గర ఉంది - మా ప్రభుత్వానికేం ఢోకా లేదు : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth Reddy Chitchat

CM Revanth on Party Defections : ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయం బీఆర్​ఎస్​ మైండ్​ గేమ్​లో భాగమేనని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్​ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకుంటారని, కేసీఆర్​ కోసం కొత్త రాజ్యాంగం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్​ లక్కీ నంబర్​ తమ దగ్గర ఉందని అన్నారు. దిల్లీలో మీడియాతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

CM Revanth on Party Defections
CM Revanth on Party Defections (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 7:29 AM IST

Updated : Sep 13, 2024, 7:41 AM IST

CM Revanth Reddy Chitchat With Media : దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న సీఎం రేవంత్​ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. 'తమ ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి పడగొడతామని బీఆర్​ఎస్​, బీజేపీలే పదేపదే చెప్పాయి. కానీ కేసీఆర్​ లక్కీ నంబరు మా దగ్గర ఉంది. అందుకు ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్​దే తుది నిర్ణయం. పీసీసీ అధ్యక్షుడు ఇప్పుడే నియమితులయ్యారు. ఆయన కుదురుకున్నాక నిర్ణయం తీసుకుంటాం. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కూర్పు ఉంటుంది.' అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై పార్టీ పెద్దలతో చర్చించడానికి దిల్లీకొచ్చిన ఆయన, ఇక్కడ గురువారం తన అధికార నివాసంలో విలేకరులతో వివిధ అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతో కలిసి మధ్యాహ్న భోజన సమయంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై చర్చించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడి సమయం ఇవ్వాలన్న చెప్పిన సీఎం మాటలతో మంత్రి వర్గ విస్తరణ ఇంక ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. హైదరాబాద్​లో పాత్రికేయుల గృహనిర్మాణ సంఘానికి భూమి అప్పగించడంతో సీఎంకు శాలువాకప్పి దిల్లీలోని పాత్రికేయులు ధన్యవాదాలు తెలిపారు.

అదంతా బీఆర్​ఎస్​ మైండ్‌గేమ్‌లో భాగమే : 'ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే ఇక్కడా జరుగుతుంది. కేసీఆర్​ కోసం కొత్త రాజ్యాంగమేమీ ఉండదు. ఉపఎన్నికలు వస్తాయనే బీఆర్​ఎస్​ మైండ్​ గేమ్​ ఆడుతోంది. ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ, బీఆర్​ఎస్​ ప్రకటించిన తర్వాతే ఫిరాయింపుల చర్చ మొదలైంది. ఎవరైనా అటూఇటూ చూస్తే అనర్హత వేటుపడాలంటే ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. బీఆర్​ఎస్​, బీజేపీల నాయకులు కోర్టుకుపోయి ఏదో ఉత్తర్వులు తెచ్చామంటున్నారు. వారెలాంటి ఆదేశాలు తెచ్చినా అది పాలక పార్టీకి అనుకూలమే. పక్క పార్టీల ఎమ్మెల్యేలను తీసుకున్నామని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలా తీసుకొనే అవకాశమే లేకుండా చట్టాన్ని పకడ్బందీగా చేస్తే తామే ఎక్కువ సంతోషిస్తాం.

విపక్షాలు ప్రభుత్వం చేసే పనులు గురించి మాట్లాడకుండా తొలి రోజు నుంచే ప్రభుత్వం ఉండేది మూణ్నెళ్లేనని అనడమంటే అర్థం పడగొడతామనే కదా అని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. ఒకవైపు పడగొడతామని చెబుతూనే మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు ఎటూ కదలకుండా ఉండాలని చెబుతున్నదీ వాళ్లేనన్నారు. అప్పుడు కాంగ్రెస్​ పార్టీకి చెందిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ ఎమ్మెల్యే కలిపి 66 మంది ప్రభుత్వం వైపు ఉంటారని గుర్తు చేశారు. కేసీఆర్​ లక్కీ నంబరు (6) తన వద్ద ఉందని, తమ ప్రభుత్వానికి ఏం ఢోకా లేదని సీఎం స్పష్టం చేశారు.

పీఏసీ పదవికి పార్టీ ప్రతిపాదన అవసరం లేదు :పీఏసీ పదవికి పార్టీ ప్రతిపాదన అవసరం లేదని, అరెకపూడి గాంధీకి బీఆర్​ఎస్​ సభ్యుడి హోదాలోనే ప్రజాపద్దుల సంఘం అధ్యక్ష పదవి దక్కింది. అధ్యక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్​ ఇస్తే ఆసక్తి ఉన్నవారు నామినేషన్లు వేశారు. రహస్య ఓటింగ్​ విధానంలో అరెకపూడి గాంధీ గెలిచారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్​ కూడా ఇలా పీఏసీ సభ్యత్వానికి జరిగిన ఎన్నికలో 160 ఓట్లతో గెలిచారు. గత అసెంబ్లీ సమావేశాల చివరిరోజు స్పీకర్​ పార్టీల బలాబలాలను ప్రకటించడం సహా బీఆర్​ఎస్​ సభ్యుల సంఖ్యను38గా చెప్పారు. దానికి బీఆర్​ఎస్​ నాయకులెవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. అప్పుడు అరెకపూడి ఆ పార్టీ సభ్యుడికిందే లెక్క. ఇప్పుడు పీఏసీ ఉదంతాన్ని ప్రశ్నిస్తున్న వారు 2018 నుంచి 2023 వరకు కాంగ్రెస్​ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ పీఏసీ ఛైర్మన్​గా అక్బరుద్దీన్​ ఒవైసీ ఎలా వ్యవహరించారు? సమాధానం చెప్పాలని నిలదీశారు.

కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటారా? లేదా? : ఇప్పుడు తాము అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదు. పీఏసీలోని 13 సభ్య స్థానాల్లో బీఆర్​ఎస్​కు ఆరు, కాంగ్రెస్​కు 4, ఎంఐఎం, సీపీఐ, బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చాం. బయట నుంచి బతకడానికొచ్చిన నువ్వేంటి మాట్లాడేదని అరెకపూడి గాంధీ గురించి కౌశిక్​రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక వాళ్ల బాస్​ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి పాటించాలి. కౌశిక్​రెడ్డి మాటలకు కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు సమాధానం చెప్పాలి. వారు చెబుతున్నట్లు అలా బతకడానికి వచ్చిన వాళ్లు ఓట్లేస్తేనే కదా నగరంలో వారికి అన్ని సీట్లు వచ్చాయి. ఓట్లు వేసిన వాళ్లను అవమానించేలా ఎమ్మెల్యే మాట్లాడటంపై కేసీఆర్​ కుటుంబం సమాధానం చెప్పాలి. కేసీఆర్​ కుటుంబం మాట్లాడించి ఉంటే క్షమాపణ చెప్పాలి. కౌశిక్​ సొంతంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలి.

గుర్తింపు బాధ్యతను ప్రెస్‌ అకాడమీకే అప్పగిస్తాం :పాత్రికేయుల పేరుతో యూట్యూబ్​లలో మాట్లాడే వారి భాష అరాచకంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో పాత్రికేయ సంఘాలే అప్రమత్తంగా వ్యవహరించి ఎవరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలో సూచించాలని, ఈ విషయాన్ని ప్రెస్​ అకాడమీకి అప్పగించి సమీక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు.మరోవైపు తెలంగాణలో వరద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్​కు సమర్పించినట్లు సీఎం రేవంత్​ వెల్లడించారు. దానికి ఆయన హోంమంత్రికి అప్పగించారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర బృందం నివేదిక సమర్పించాకే హోంమంత్రిని కలుస్తానని చెప్పారు.

కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత - స్టేషన్ బెయిల్‌పై విడుదలైన అరెకపూడి - క్షమాపణ చెప్పాలని డిమాండ్ - AREKAPUDI GANDHI VS KAUSHIK REDDY

కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ ఛైర్మన్‌ ఎలా ఇచ్చారు: సీఎం - CM REVANTH DELHI VISIT UPDATES

Last Updated : Sep 13, 2024, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details