BJP Leaders on Delhi Election Result 2025 : దిల్లీలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు దిల్లీ ఏర్పడబోతుందన్న ఆయన, అక్కడి ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ భారత దేశంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని, కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత : బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. హిందూ బీసీ, ముస్లిం బీసీ రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్నించిన కేంద్రమంత్రి బీసీలను అవమానిస్తూ అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం బీసీ పదాన్ని తొలగిస్తామని తెలిపారు.
చీపిరితో ఊడ్చేశారు : దిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. దిల్లీ ప్రజలు చీపిరితో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను దిల్లీ ప్రజలు కోరుతున్నారన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వారికి వద్దని భావించారని విమర్శించారు. దిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచీ ఊహించిందేనన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని చెప్పారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి వర్గం, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసన మండలిలో సమస్యలను ప్రశ్నించేది బీజేపీ ఒక్కటేనన్నారు.
27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ - మిగతావి ఎప్పుడంటే?
కమలం గూటికి కరీంనగర్ మేయర్ - బీఆర్‌ఎస్ నేతల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని వార్నింగ్