Chandrababu Fight on Pensions Issue in AP :పింఛన్ల పంపిణీ ఆలస్యంలో అధికార వైఎస్సార్సీపీ తీరును రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు తప్పుపట్టారు. పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే ఇప్పించేలా తెలుగుదేశం దశల వారి పోరాటాన్ని విస్తృతం చేసింది. తాజాగా అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం పైనా ఒత్తిడి తీసుకొస్తున్నారు.
పింఛన్ల నిధులను బిల్లులకు చెల్లించారు- పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షంపై విషప్రచారం: టీడీపీ నేతలు
సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పింఛన్లు ఇంటింటికీ పంపకుండా సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి చేస్తున్న కుట్రలనూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు కిలో మీటర్ల దూరం వెళ్లలేరని ఇంటి వద్ద పింఛను అందించే ఏర్పాటు చేయాలని కోరారు. పింఛన్లు అందకపోవడానికి తెలుగుదేశం కారణమని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ తెలుగుదేశంపై బురద జల్లడం కోసం ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయొద్దని వైసీపీ ప్రభుత్వం మురళీధర్ రెడ్డిపై రాజకీయ ఒత్తిడి చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
Pensions Distribution Issue : రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని చంద్రబాబు కోరారు. ఈ మేరకు సీఎస్ కు ఫోన్ చేసిన ఆయన పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాల్సిన అసవరం ఉందని స్పష్టం చేశారు.