BRS Leaders Holds Dharna For Complete Loan Waiver : అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసాన్ని ఎండగడుతూ అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలంటూ బుధవారం కేటీఆర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పరకాల మాజీ ఎమ్మెల్యే పాలతో అభిషేకం చేశారు. అనంతరం రైతులతో కలిసి ధర్నాలో పాల్గొని కాంగ్రెస్‌పై ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ, సహా అన్ని హామీలు అమలు చేయాలంటూ భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాల ముందు గులాబీ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ఎన్నికల ముందు గప్పాలు కొట్టిన కాంగ్రెస్, ఇపుడు ఏం చేస్తుంది? : నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీసు ముందు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర రావు ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా చేశాయి. తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి పాలతో అభిషేకం చేసిన నేతలు, వెంటనే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు చేవెళ్ల రైతుల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సంపూర్ణ రైతు రుణమాఫీ కోసం నిరసన తెలుపుతూనే తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు గప్పాలు కొట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇపుడు ఏం చేస్తున్నారో చూస్తున్నాం కదా అని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసానికి రైతులు అందరూ గలం ఎత్తాల్సిన అవసరం ఉందని కోరారు. రుణమాఫీ మొత్తం పూర్తయితే రేవంత్ రెడ్డికి భయం ఎందుకని ప్రశ్నించారు. తెల్లారితే కేసీఆర్ పేరు ఎత్తనిది రేవంత్ రెడ్డికి పూట గడవదని ఎద్దేవా చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ రుణమాఫీపై ఆందోళనలు మిన్నంటాయి. నల్గొండ, హలియా, హుజూర్‌నగర్, మిర్యాలగూడ ధర్నా నిర్వహించారు. తుంగతుర్తి మండలం తిరుమలగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గులబీదళం చేపట్టిన ధర్నాను కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు అడ్డుకోవడం, ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. రుణమాఫీ కోసం శాంతియుతంగా ధర్నా చేస్తే కాంగ్రెస్ దాడులకు దిగుతోందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు.