MLC Kavitha Will Arrive Hyderabad Today :దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన భారత రాష్ట్ర సమితి నేత, శాసనమండలి సభ్యురాలు కవిత 164 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన పూచీకత్తును కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. వాటిని అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కవిత విడుదలకు అనుమతిస్తూ తీహాడ్ జైలుకు వారెంట్ జారీ చేశారు.
భావోద్వేగానికి గురైన కవిత :విడుదల ప్రక్రియ అనంతరం రాత్రి 9 గంటల తర్వాత కవిత తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడికి కవిత భర్త, కుమారుడు, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎంపీలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నాయి. జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే కుమారుడు, భర్త సహా సోదరుడు కేటీఆర్ ఆలింగనం చేసుకొని కవిత ఉద్వేగానికి లోనయ్యారు. తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదని కవిత పేర్కొన్నారు. ప్రజల కోసం మరింతగా పోరాడతానని చెప్పారు.
"18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను. పాలిటిక్స్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. వ్యక్తిగతంగా నాకు, నాకుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5 నెలలు దూరంగా ఉండటం చాలా ఇబ్బందికరమైన విషయం. నాకుటుంబాన్ని ఇబ్బందులు పాల్జేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం.- కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ