BRS MLA Danam Met with CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ఇవాళ కలిశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో కలవగా, సిట్టింగ్ బీఆర్‌ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సచివాలయంలో వేరువేరుగా కలిశారు. వరంగల్‌లో సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి, కడియం శ్రీహరి(MLA Kadiam Srihari) కుమార్తె కావ్యకు బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న దయాకర్ ఇవాళ సీఎం రేవంత్‌తో కలిశారు.
BRS Warangal MP Pasunuri Dayakar Meet Revanth Reddy : కానీ కాంగ్రెస్ పార్టీ వరంగల్ టికెట్ ఎవరికి ప్రకటించనందున ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న దొమ్మాటి సాంబయ్య, స్టేషన్ ఘనపూర్ ఇందిరలతోపాటు దయాకర్ కూడా పోటీ పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
దిల్లీ మద్యం కుంభకోణం కేసు - ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
అదే రోజున దానం నాగేందర్ కూడా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. సీఎంతో దానం భేటీ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు రోహిత్ చౌదరీ, విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గూటికి చేరువయ్యేనా? : గత కొన్ని రోజులుగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, దానం నాగేందర్ అనుచరులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు దానం నాగేందర్(MLA Danam Nagender) సుముఖంగా ఉన్నట్లు తెలుసుకున్న తరువాతనే ఇవాళ సీఎంను కలిసేందుకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమైన నాయకులను పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కలిసే సమయంలో అవకాశం ఉన్న మేరకు సీనియర్లను కూడా కలుపుకుని పోవాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది.