కొత్త జిల్లాలు కొనసాగించకపోతే - కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం తప్పదు : కేటీఆర్ (ETV BHARAT) BRS Leader KTR Fires on CM Revanth :పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా కాంగ్రెస్ పాలన ఉందని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. పార్లమెంటు స్థాయికి ఒక జిల్లా ఉండాలని కాంగ్రెస్ వాళ్లు చెప్తున్నారని 33 జిల్లాలో ఏ జిల్లాలను తొలగిస్తారు? ఏ జిల్లాలను ఉంచుతారో తప్పకుండా తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి, మాట్లాడారు.
పది జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 23 జిల్లాలు అందులో కొన్ని మహానుభావుల పేరిట జిల్లాలు ఉన్నాయని తెలిపారు. అసిఫాబాద్ కొమురం భీం జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మచ్చుకు కొన్ని ఇలా ఉండగా, పోరాడి సాధించుకున్న జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యమైందన్నారు.
"రాజన్న సిరిసిల్ల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి. అసలు ఈ జిల్లాను కొనసాగిస్తారా, లేదా తీసేస్తారా? 33 జిల్లాల్లో 17 జిల్లాలుగా మార్చాలనుకుంటే మిగిలిన 16 జిల్లాల పరిస్థితి ఏమిటి? దీనిపై కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికైనా సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్లి, నేతన్నలకు తిరిగి ఆర్డర్స్ ఇవ్వండి."-కేటీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే
ప్రజా ఉద్యమానికి గులాబీ పార్టీ నాయకత్వం :కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త జిల్లాలను కచ్చితంగా కొనసాగించాలని లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని కేటీఆర్ అన్నారు. ప్రజా ఉద్యమానికి గులాబీ పార్టీ నాయకత్వం వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఖరి ఎలా ఉందంటే కేసీఆర్ ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా చేయాలన్న ధోరణిలో ఉన్నారని ధ్వజమెత్తారు. సిరిసిల్ల నేతన్నల కోసం కేసీఆర్ 3000 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి, నేతన్నల బతుకులు నిలబెట్టారని, వారు ఆత్మగౌరవంగా బతకడానికి ఉపాధి కల్పించారన్నారు.
KTR on Handloom Workers Facing Problems :ప్రపంచంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కడితే దానికి కనీసం పూలదండ కూడా వేయకుండా అగౌరవపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కొత్తగా ఇంకా ఏమైనా ఏర్పాటు చేయాలే తప్ప, ఉన్న వాటిని తీసేస్తామనటం తుగ్లక్ తీరును తలపిస్తుందని ఆక్షేపించారు. సిరిసిల్ల నేతన్నల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించారు.
నేతన్నలను ఆదుకుంటారా లేదా చనిపోతుంటే చూస్తుంటారా చెప్పాలన్నారు. సిరిసిల్ల పర్యటనలో సాగు తాగునీటి వనరులపై సీఎం ఒక మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలను అమలు చేశానని చెప్పుకుంటూ తిరుగుతుంటే ప్రజలు చీత్కరించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చుకుంటే, రేవంత్ రెడ్డి తారీఖు మార్చుతున్నారని డిసెంబర్ 9న రుణమాఫీ అని, మళ్లీ ఇవాళ ఆగస్టు 15న అంటున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా ఇవ్వరా? : మొన్న ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కులేదు, కానీ మళ్లీ ఇవాళ ఐదు గ్యారంటీల పేరిట సరికొత్త డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు. ప్రజలంతా గ్రహిస్తున్నారన్న ఆయన, హస్తానికి మే 13న ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. జిల్లాలు ఎన్ని ఉంచుతారు? నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా లేదా? గోదావరి నీళ్లు సిరిసిల్ల ప్రాంతానికి ఎలా తీసుకొస్తారు, కాళేశ్వరంలోని బరాజులో ఉన్న చిన్న రిపేరు ఎప్పుడు చేస్తారు అని రైతులు, జిల్లా కోసం పోరాడిన ప్రజలు అడుగుతున్నారన్నారు. వీటికి నిజాయితీగా సమాధానం చెప్పకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు.
వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు - రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ - KTR Letter to CM Revanth
పార్లమెంట్ ఎన్నికల్లో 'చెయ్యి' విరిగిపోవాలే - 'పువ్వు' వాడిపోవాలే - కారు రయ్‌మని ఉర్కాలే : కేటీఆర్ - KTR campaign in sircilla