BRS Chief KCR Road Show At Nagarkurnool : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్‌కర్నూలులో గులాబీ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించిన కేసీఆర్, కాంగ్రెస్ పాలనలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు.
KCR Fires on BJP Govt :బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టం అన్న కేసీఆర్, ప్రధాని మోదీ వంద నినాదాలు చెప్పారని మరి ఒక్కటైనా జరిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల అయినా కేంద్రం ఇచ్చిందా? దేశమంతా మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదని, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు.
"తెలంగాణ ప్రజలకు , కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడింది ఇప్పుడు, మరి ప్రజల తరఫున పోట్లాడాలంటే కేసీఆర్ గెలవాలి. ఈ దుర్మార్గ కాంగ్రెస్ మెడలు వంచాలంటే సార్వత్రిక ఎన్నికల్లో యుద్ధం చేయాల్సిందే. దానికి మీ బలం కావాలి. ఇక్కడ చదువుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ గెలిపించుకోవాలి."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
KCR Fires On Congress Government : తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను బాగా చూసుకున్నామన్నారు. అదేవిధంగా వలసల జిల్లా పాలమూరును సస్యశ్యామలంగా మార్చామని తెలిపారు. కానీ ఇప్పుడేమో రాష్ట్రంలో కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ధగా చేసిందన్నారు. కేవలం 1.80 శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని వివరించారు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పంచాయతీ వచ్చిందని, ప్రజల తరఫున కొట్లాడేందుకు కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు.