BJP Operation Akarsh in Telangana 2024 : రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం పదైనా గెలవాలని బీజేపీలక్ష్యంగా పెట్టుకుంది. అధిష్ఠానం సైతం పది సీట్లతో పాటు, 35 శాతం ఓటు బ్యాంకును రాష్ట్ర నాయకత్వానికి లక్ష్యంగా పెట్టింది. అన్ని పార్టీల కంటే ముందుగానే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మోదీ ఛరీష్మాతో పది సీట్లు సునాయసంగా కైవసం చేసుకోవచ్చని భావించిన కమలదళానికి, బలమైన అభ్యర్థుల లేమి తలనొప్పిగా మారింది. దీంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) నేతలపై బీజేపీ కన్నుపడింది.
బీఆర్ఎస్లోని బలమైన అభ్యర్ధులను పార్టీలోకి చేర్చుకోవాలని భావించింది. పార్టీలో బలమైన అభ్యర్థులు లేని నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమైంది. బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌ను కాషాయగూటికి చేర్చుకుని తొలి జాబితాలోనే అభ్యర్థిత్వం ఖరారు చేసి పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
BJP Focus on Lok Sabha Polls 2024 : తాజాగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ (Ex MP Seetharam Naik), మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌లను కాషాయగూటికి తీసుకొచ్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు ఈ ఇద్దరితో టచ్‌లోకి వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అసంతృప్తితో ఉన్న సీతారాం నాయక్ తాజాగా మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) మాత్రం ఆ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత పేరునే ఖరారు చేశారు. పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న సీతారాం నాయక్ నివాసానికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.