Kishan Reddy about Congress : ఇవాళ జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో బీజేపీ కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు.
రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లు బీజేపీకే మొగ్గు చూపారని, తాము ఆశించినట్లుగానే ఆ పార్టీకి రెండంకెల సీట్లు వస్తాయని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని, అయినా సీఎం రేవంత్, రాహుల్‌గాంధీ మాటలను నమ్మలేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ కార్యకర్తలే వీరి మాటలను సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. పార్టీ ఏదైనా సరే ప్రధానిగా మోదీ ఉండాలని ప్రజలు భావించారని పేర్కొన్నారు. పట్టణప్రాంత వాసులే కాదని, ఈసారి పల్లెల్లోనూ బీజేపీకు ఓట్లు బాగా వేశారని తెలిపారు.
రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం బలపడటానికి అవకాశం :మోదీకే ఓటు వేస్తున్నామని పోలింగ్ కేంద్రాల వద్ద బహిరంగంగా చెప్పారని కిషన్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌లోనూ కొంత పోలింగ్ శాతం తగ్గిందని, అయినా బీజేపీకి సానుకూలంగా ఓట్లు పడ్డాయని అన్నారు. ఎక్కువ మంది ఏపీ ప్రజలు ఓట్ల కోసం అక్కడికి వెళ్లిపోయారని, అందుకే హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పారు. హైదరాబాద్‌లో సెలబ్రిటీలు కూడా క్యూలో నిలబడి ఓటేశారని, వారు లైన్లో నిలబడి ఓటేయడం మంచి సందేశమని కొనియాడారు.