BJP MLA Alleti Comments on Congress Govt : రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ విలీనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఏం చేసిన ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుందన్న ఆయన, లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుందని ప్రశ్నించిన ఏలేటి, అంత అవసరం తమకు లేదని పేర్కొన్నారు. పూర్తి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్తారని ఏలేటి నిలదీశారు. రైతులందరికి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని బీజేపీ శాసనసభాపక్ష నేత సీఎంను ఉద్దేశించి సవాల్ విసిరారు. రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
BJLP Leader Alleti On CM Revanth : రుణమాఫీ అయిన అర్హుల జాబితాను వెంటనే బయటపెట్టాలన్నారు. పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి ఉపయోగించారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసా ఎందుకివ్వడంలేదని ఎప్పటిలోపు ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందంటే, అందరికీ రుణమాఫీ కాలేదని ఒప్పుకుంటున్నట్లే కదా? అని అన్నారు. మీరు చెప్పిన గ్రామానికే వెళ్లి, ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యిందో వారినే నేరుగా అడుగుదామని, ఇందుకోసం మీరు వస్తారా? మీ వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా? రండి అని సీఎంకు ఏలేటి సవాలు విసిరారు.