- తప్పిపోయిన భార్య
- ఆమె కోసం వెతికి వెతికి భర్తకు కంటిచూపు మందగింపు!
- కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకున్న భర్త
- తర్వాత కళ్లు తెరిచి చూస్తే ఆస్పత్రి పక్క బెడ్లో భార్య ప్రత్యక్షం
వినడానికి సినిమా స్టోరీలా ఉన్నా ఈ ఘటన నిజంగా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా కేవతా తలాబ్ బస్తీకి చెందిన రాకేశ్ కుమార్‌కు ఈ అనూహ్య అనుభూతి ఎదురైంది. అసలు అతడి భార్య ఆస్పత్రికి ఎలా వచ్చింది? అదే సమయంలో రాకేశ్ కుమార్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
![Missing Wife Surprisingly Found In Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/up-unn-01-hospitalstory-visualbyte-10050_13022025115258_1302f_1739427778_565.jpg)
ఇదీ జరిగింది
రాకేశ్ కుమార్ భార్య శాంతీదేవి జనవరి 13 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో అతడు ఎంతో మానసిక వేదనకు లోనయ్యాడు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసును నమోదు చేశారు. భార్య శాంతీదేవి ఫొటోతో సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశాడు. తాను స్వయంగా కాన్పుర్, లఖ్‌నవూ, కనౌజ్ నగరాలకు వెళ్లి వెతికాడు. అయినా శాంతీదేవి ఆచూకీ దొరకలేదు. దీంతో ఆవేదనకు లోనైన రాకేశ్ కుమార్ ఇంటికి వెళ్లడం మానేశాడు. తన స్నేహితుడి రూంలో ఉండటం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే కంటిచూపు మందగించింది. దీంతో వెంటనే ఉన్నావ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించి, వీలైనంత త్వరగా కంటిశుక్లం సర్జరీ చేయించుకోవాలని సూచించారు.
![Missing Wife Surprisingly Found In Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/up-unn-01-hospitalstory-visualbyte-10050_13022025115258_1302f_1739427778_423.jpg)
వైద్యుల సూచన మేరకు ఆయన ఉన్నావ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిబ్రవరి 6న కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఫిబ్రవరి 7న రాకేశ్‌ను ఆస్పత్రిలోని బెడ్ నంబర్ 20కి తీసుకెళ్లారు. ఆ బెడ్‌పైనే పడుకోబెట్టి, కళ్లకు ఉన్న కట్టును తీశారు. ఆ వెంటనే కళ్లు తెరిచిన రాకేశ్ కుమార్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తన పక్కనే ఉన్న 19వ నంబర్ బెడ్‌పై కూర్చొని ఉన్న భార్య శాంతీదేవిని చూసి సంతోషంగా ఫీలయ్యాడు.
కళ్ల కట్లు విప్పే సమయంలో ఆ మాటలు విని
రాకేశ్ కళ్లకు ఉన్న కట్టును వైద్యసిబ్బంది జాగ్రత్తగా తొలగిస్తున్న సమయంలో ఆయనకు ఒక గొంతు వినిపించింది. అది బాగా సుపరిచితమైన గొంతులా అతడికి అనిపించింది. తనకు తాగడానికి నీళ్లు కావాలని ఒక మహిళ అడుగుతోంది. తిరిగి చూస్తే పక్కనున్న 19వ నంబరు బెడ్‌పై భార్య శాంతీదేవి కూర్చొని ఉంది. సంతోషాన్ని ఆపుకోలేక, రాకేశ్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్లాడు. ఎక్కడికి వెళ్లావ్ ? ఏమైంది నీకు ? అని ప్రశ్నించాడు. అయితే ఆమె సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. తలపై బలమైన గాయం ఉంది. ఆమెకు మరిన్ని రోజులు మెరుగైన చికిత్స అవసరమని డాక్టర్లు రాకేశ్‌కు చెప్పారు. తలపై గాయం అయిన వెంటనే ఎవరో శాంతీదేవిని ఆస్పత్రిలో చేర్పించారన్నారు.
'భార్యను కలిశాక బాధనంతా మర్చిపోయాను'
"మాది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. నా భార్య మానసిక ఆరోగ్యం బాగా లేదు. ఇంట్లో ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు" అని రాకేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటప్పుడు తమకు ఆర్థిక సహాయం అవసరమని చెప్పాడు. "నా భార్యను కలిసిన తర్వాత బాధనంతా మర్చిపోయాను. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఆమె మాట్లాడటం ప్రారంభించింది. ఆమె ఇలా దొరుకుతుందని నేను కలలో కూడా అనుకోలేదు" అని రాకేశ్ ఆనందం వ్యక్తం చేశాడు.