Bandi Sanjay Challenge to Congress Party : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేసినట్లు నిరూపిస్తే, పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ స్పష్టం చేశారు. నిరూపించలేకపోతే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు. సోమవారంలోపు నిరూపిస్తే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని చెప్పారు. కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ కండువా కప్పి కమలం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ సవాల్ విసరగా, బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని బండి సంజయ్ ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారన్నారు. తమ మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని కాంగ్రెస్ నేతలు చెప్పారని మండిపడ్డారు. అందులో హామీలు నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. మహిళల ఖాతాల్లో రూ.2400 జమ చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు నిరూపించాలన్నారు. విద్యార్థుల భరోసా కార్డులు ఇచ్చామని చెప్పుకుంటున్న హస్తం పార్టీ నేతలు, అందుకు తగిన ఆధారాలు చూపాలని ప్రశ్నించారు. వీటిన్నింటిని నిరూపించకపోతే 15 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.