Traffic Jam On National Highway : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతిని బంధుమిత్రులతో కలిసి జరుపుకొనేందుకు ప్రజలు ఎవరి సొంత వాహనాల్లో వారు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి. తెలంగాణలో శనివారం (జనవరి 11) నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో సొంతూళ్లకు బయలు దేరారు. దీంతో ఎల్బీనగర్ కూడలి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీతో పాటు వ్యక్తిగత వాహనాలతో ఎల్బీనగర్ నుంచి పనామా వరకు ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్ లేకపోవడంతో సమస్య : వేలాదిగా వస్తున్న వాహనాలతో జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. నల్గొండ జిల్లాలో చౌటుప్పల్ పట్టణంలో ఫ్లైఓవర్ లేకపోవడంతో అక్కడి స్థానిక పాదచారులు, ద్విచక్ర వాహనదారులు విజయవాడ జాతీయ రహదారిని దాటే క్రమంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో వైపు రహదారిపై ముఖ్యమైన పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి.
టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ పోలీసులు : ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనంగా మరో రెండు బూత్‌లను కలిపి మొత్తంగా 10 తెరిచి ఉంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. చౌటుప్పల్ పట్టణంలో, పంతంగి టోల్ ప్లాజా వద్ద కొత్తగా విధుల్లో చేరిన 50 మంది ట్రాఫిక్ పోలీసులు డ్యూటీని నిర్వహిస్తున్నారు. సొంతూళ్లకు వేళ్లే ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేస్తున్నారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు