AP High Court on English Medium in Govt Schools :నైపుణ్య పరీక్షలో అర్హత సాధించని వారు ఆంగ్ల మాధ్యమంలో ఎలా పాఠాలు బోధిస్తారని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అర్హత సాధించని వారిని ఎంపిక చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఆంగ్ల నైపుణ్యం లేనివారితో బోధన సరికాదని పేర్కొంది. ఉపాధ్యాయులుగా ఎంపికైన తర్వాత రెండేళ్లపాటు నైపుణ్య తరగతులుంటాయని ప్రభుత్వం చెప్పడాన్ని ఆక్షేపించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌కు నోటీసులు జారీచేసింది.
డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతోందని, సంబంధిత నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో ఏకపక్షంగా జోక్యం చేసుకోలేమని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వుల విషయాన్ని కౌంటర్ దాఖలు చేశాక పరిశీలిస్తామంది. ముందే కోర్టును ఆశ్రయించి ఉండాల్సిందని పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. హైకోర్టుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయుల్ని నియమించాలని, అన్ని బడులను సమానంగా చూసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అసోసియేట్ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేశారు. ఉపాధ్యాయుల నియామకం విషయంలో ప్రభుత్వం ఈ ఏడాది జారీ చేసిన జీవోలు విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు.