AICC New Committee On Party Joinings in Telangana : కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందని రాష్ట్ర నేతలు అన్నారు. పార్టీ అభ్యర్థికి నష్టం చేసినవాళ్లు అయినా చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఏఐసీసీ ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాల మేరకు చేరికల కోసం హస్తం పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డిలతో కలిసి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
తమకు వ్యతిరేకంగా పని చేసిన నాయకులు వచ్చి చేరినా తాము అభ్యంతరం చెప్పమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ గాంధీభవన్‌లో పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన నాయకులను చూసి ఎవరూ నారాజ్ కావొద్దని అందరూ కలిసి పని చేయాలని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో ఎవరు వచ్చినా కండువా కప్పుతామని, ఎలాంటి షరతులు ఉండవని కోదండ రెడ్డి అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లో చేరికల జోరు - ఆ వ్యూహంలో భాగమేనా!
"జగ్గారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్ గౌడ్ వీరు ముగ్గురితో ఏఐసీసీ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు రోజులు ఉండనుంది. కమిటీ ఉన్న రెండు రోజులు ఏ పార్టీ నుంచి వచ్చినా వారిని చేర్చుకుంటాము. ఎలాంటి కండీషన్స్ లేకుండా పార్టీ కండువా కప్పుతాము. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయి రాడానికి ఆలోచిస్తున్నవారికి కూడా అవకాశం ఉంది. అందరు పార్టీలో చేరిన తర్వాత స్థానిక లీడర్ల కింద పని చేయాలి." - జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్