Abhishek Manu Singhvi Nomination for Telangana Rajya Sabha : తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి శాసససభలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ హాజరయ్యారు.
అభిషేక్ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కావాలి :అభిషేక్ సింఘ్వీది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సింఘ్వీ వల్ల రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని అన్నారు. అభిషేక్ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అలాగే అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభివృద్ధికి అనేక పథకాలు తీసుకువచ్చామని చెప్పారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్ గడువు :కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీ భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉంది. ఒకే నామినేషన్ వచ్చినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. లేదంటే వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.