Special Story on Tollywood Cinema Piracy :సినీ పరిశ్రమకు పట్టిన చీడ పురుగు పైరసీ. కోట్లాది రూపాయల పెట్టుబడి, వందలమంది కష్టానికి గండికొడుతూ పైరసీ సినిమా రంగానికి అతి పెద్ద సమస్యగా మారింది. సినిమా అలా విడుదలవుతుందో లేదో ఇలా పైరసీ ప్రింట్లను పెడుతూ పైరసీ మాఫియా నిర్మాతల ఆదాయా న్ని దెబ్బతీస్తోంది. సినిమా డిజిటల్ హంగులు అద్దుకోవడంతో ఈ రక్కసి కోరలు మరింత విస్తరిస్తున్నాయి. చిన్న, పెద్ద, ఆ భాష, ఈ భాష అనే తేడా లేకుండా సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ చిత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఓటీటీ మార్కెట్ ను కూడా దెబ్బతీస్తున్నాయి. మరి పైరసీని అడ్డుకునేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన సెల్ ఏం చేస్తోందో తెలుసా?
సినీ పరిశ్రమకు సవాళ్లు :ఓ అగ్ర హీరో సినిమా విడుదలైన రోజు అభిమానులంతా ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. థియేటర్‌లో బొమ్మ పడింది. బ్లాక్ బస్టర్ టాక్ బయటికొచ్చింది. కట్ చేస్తే 24 గంటలు కాకముందే ఆ సినిమా హై క్వాలిటీతో నెట్టింట కనిపించే సరికి పరిశ్రమంతా అవాక్కైంది. ఇంకో హీరో సినిమా విడుదలైన 2 రోజుల్లోనే ఓ ఆర్టీసీ బస్‌లో హెచ్ డీ ప్రింట్‌తో ప్రదర్శించారు. వాట్సప్‌లో లింకులు టెలిగ్రామ్‌లో షేరింగ్‌లు యూట్యూబ్‌లో ముక్కలు ముక్కలుగా సినిమా.
అయినా సరే అన్నీ భరించి ఓటీటీకి ఇచ్చినా ఆ మరుక్షణమే సర్వర్‌లోకి చొరబడి మరీ కొల్లగొడుతున్నారు. ఇదీ పైరసీ మాఫియా సినీ పరిశ్రమకు విసురుతున్న సవాళ్లు. కోట్ల రూపాయల పెట్టుబడిని గంటల వ్యవధిలో ఆవిరి చేస్తోంది ఈ మాఫియా. పైరసీ దెబ్బకు గతేడాది దేశవ్యాప్తంగా 22 వేల 400 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో 13 వేల 700 కోట్ల రూపాయలు థియేటర్లు నష్టపోగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు 8,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
ఓటీటీ సంస్థలకు నష్టం : నిజానికి భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా స్థాయి, స్థానం మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సినిమాలను అందిస్తోందని టాలీవుడ్ పేరు సంపాదించినా పైరసీ వలలో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టాలీవుడ్‌లో ఏటా సుమారు 300 సినిమాలు విడుదలైతే అందులో నిర్మాతలకు, పంపిణీదారులకు, సినిమాపై ఆధారపడ్డ వాళ్లకు లాభాలు తెచ్చిపెట్టేవి 20 నుంచి 25 సినిమాలే ఉంటాయి.
అయితే అందులో ఘన విజయం సాధించిన చిత్రాలకు కూడా వసూళ్ల పరం గా ప్రతికూలత ఎదురవుతోంది. కారణం విడుదలైన రోజే ఆ చిత్రాలు పైరసీ బారినపడటం. అభిమానులు మినహాయిస్తే థియేటర్‌లో చూద్దామని భావించిన ప్రేక్షకుడికి పైరసీ ప్రింట్ దొరకడంతో డౌన్‌లోడ్ చేసుకొని చూడటం థియేటర్ వసూళ్లపై ప్రభావం చూపుతోంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా క్షణాల్లో అత్యంత నాణ్యమైన ప్రింట్ పైరసీ సైట్లలో కనిపించడంతో ఓటీటీ సంస్థలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి.
ఒకేసారి వేలాది ప్రింట్లు రిలీజ్ : ఒకప్పుడు థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేసి వీడియో క్యాసెట్లు, సీడీలు, డీవీడీల రూపంలో పైరసీ చేసి సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మేవారు. వీడియో దుకాణాల్లో అద్దెలకు ఇస్తూ సొమ్ము చేసుకునేవారు. ఈ రాకెట్‌ను పట్టుకునేందుకు పరిశ్రమ వర్గాలు, పోలీసులు గుర్తించి చర్యలు తీసుకునేవారు. కొన్నిసార్లు ఇంటి దొంగలు కూడా ఎడిట్ రూమ్ నుంచే సినిమా లను లీక్ చేసేవారు. కాలక్రమంలో సినిమా ప్రింట్ల నుంచి డిజిటల్ రూపంలోకి మారింది.
ఒకేసారి వేలాది ప్రింట్లు రిలీజ్ చేయడం, విదేశాలకు సైతం ఆన్‌లైన్‌లో పంపడం పైరసీ మాఫియా పని మరింత సులభమైంది. సర్వర్‌ల నుంచే సినిమా ఫైల్ ను హ్యాక్ చేసి వెబ్‌సైట్లలో పెట్టేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారనేది కూడా తెలియకుండా పకడ్బందీ సాంకేతికతతో పైరసీకి పాల్పడుతున్నారు. వారిని కనిపెట్టి ఆ లింకులను తొలగించేలోగా సినిమాకు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోతుంది.
పైరసీని అడ్డుకునే ప్రయత్నాలు :పైరసీ నుంచి పరిశ్రమను రక్షించుకునేందుకు కొన్నాళ్ల కిందట తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. పలువురు సాంకేతిక నిపుణుల్ని నియమించి దూకుడుగా పని చేశారు. సీడీలు, డీవీడీలు పట్టుకోవడం, ఇంటర్నెట్‌లో పైరసీ లింకులు తొలగించే వారు. ఇందుకు పైరసీకి గురైన సినిమాల నిర్మాతలు నిర్ణీత మొత్తం చెల్లించేవారు. దీంతో కొన్నాళ్లు ఆ సెల్ పైరసీని అడ్డుకోగలింది.
తర్వాత నిర్మాతలు పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఆ సెల్ పని తీరు అంతంత మాత్రంగానే తయారైంది. తమ వద్దకు వచ్చే నిర్మాతలకు సంబంధించిన లింకులను మాత్రమే డౌన్ చేయడం, తొలగించడం చేస్తున్నారు. మరికొంత మంది నిర్మాతలు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించి పైరసీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించడం లేదు.