New Criminal Laws in India : మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్న ఐపీసీ, సీఆర్‌పీసీ శిక్ష్మాస్మృతుల స్థానంలో మూడు కొత్త నేర న్యాయ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇకపై జీరోఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్ ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ సాధనాలతో సాక్ష్యాధారాల సేకరణ సులభతరం అవుతుంది. కేసుల సత్వర విచారణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఈ చట్టాల్లో పోలీసులకు అపరిమిత అధికారులు కల్పించారనీ, విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయాలు సేకరించలేదనీ విమర్శలు వస్తున్నాయి.
అసలు కొత్తగా అమలులోకి వచ్చిన మూడు నేర న్యాయ చట్టాలతో నేరాల దర్యాప్తు, న్యాయ విచారణలో ఎలాంటి మార్పులొస్తాయి? ఏఏ కేసుల్లో శిక్షలు కఠినతరం అవుతాయి? ఈ చట్టాల రూపకల్పన జరిగిన తీరుపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో డా. బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న, లీగల్ అంశాల వ్యాసకర్త పీవీఎస్ శైలజ, విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ ఐజీపీ ఎస్. ఉమాపతి పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు.
కొత్త చట్టాల కింద రాష్ట్రంలో తొలి కేసు నమోదు - ఎక్కడో తెలుసా? - First case in state under new laws
నేరానికి తగ్గ శిక్షల్లేని సమాజంలో అరాచకత్వం రాజ్యమేలుతుంది. అయిదుకోట్ల పెండింగ్ కేసుల కొండ కింద నేర న్యాయ వ్యవస్థే కుదేలైపోతున్న వేళ- అభాగ్యులకు సత్వర న్యాయం అందించేలా భిన్న స్థాయుల్లో విస్తృత సంప్రతింపులతో ఓ మహా యజ్ఞంలా శాసన నిర్మాణం జరగాలి. ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు, వీడియో ద్వారాను, నిందితుల పరోక్షంలోనూ విచారణలతో సత్వర న్యాయం చేయనున్నామన్న కేంద్రం- దేశద్రోహ నిర్వచనాన్ని విస్తృతపరచి, మూక దాడుల్నీ శిక్షార్హం చేసి, అవినీతి, ఉగ్రవాదం, సంఘటిత నేరాల్ని కొత్త చట్టాల చట్రంలో బిగించి నేటి అవసరాలకు దీటుగా రాణించామంటోంది. కొత్త చట్టాల ప్రకారం పిటిషన్లు దాఖలు కాలేదంటూ కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ ఈ మధ్యే వ్యక్తీకరించిన అభ్యంతరాలు న్యాయ పాలికలో గందరగోళానికి అద్దం పడుతున్నాయి.