Healthy Diet Plan for Students : విద్యార్థులకు పరీక్షల సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో పిల్లలు చదువులో పడి ఏదిపడితే అది తింటుంటారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతుంటారు.కాబట్టి, ఈ కీలక సమయంలో పిల్లలు తీసుకునే ఆహారం విషయంలో అస్సలు అజాగ్రత్త పనికిరాదంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి. ప్రధానంగా ఒత్తిడి తగ్గించే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమంటున్నారు. ఈ క్రమంలోనే పరీక్షల వేళ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్లో పిల్లల డైట్లో ఎలాంటి ఆహారాలు చేర్చాలో కూడా సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మామూలుగానే పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించాలి. ఇక, పరీక్షల వేళ ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లతాశశి. ఎందుకంటే పోషకాహారమే ఆరోగ్యం, ఆనందం. కాబట్టి పిల్లల డైట్లో ఆ రెండూ ఉంటేనే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడంతో పాటు కెరియర్‌లోనూ ఉన్నతంగా రాణిస్తారని చెబుతున్నారు.
బ్రేక్‌ఫాస్ట్‌లో : పరీక్షల టైమ్‌లో పిల్లలు యాక్టివ్‌గా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ అస్సలు మిస్ చేయొద్దంటున్నారు డాక్టర్ లతాశశి. ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ముడిధాన్యాలతో చేసిన పోహా, రాగి దోశ, ఇడ్లీ వంటివి పెట్టాలంటున్నారు. ఇవి వద్దు అనే వారికి ఓట్స్, చక్కెరశాతం తక్కువగా ఉన్న మ్యూజిలీ ఇవ్వాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఉప్మా, పోహా, ఇడ్లీ వంటివి ఇచ్చేటట్లయితే వాటిని కూరగాయలు, ఆకుకూరలతో కలిపి వండేలా చూసుకోవాలి. ఓట్స్‌గాని ఇస్తే అందులో కొన్ని రకాల పండ్లముక్కలు, డ్రైఫ్రూట్స్‌ను యాడ్ చేస్తే బెటర్. వీటితో పాటు పచ్చసొనతో సహా ఓ గుడ్డు, గ్లాసు పాలు ఇస్తే ప్రొటీన్ అందడంతో పాటు రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
భోజనంలో ఇవి ఉండాలి : కూరగాయలు, పప్పులతో చేసిన కిచిడీ, చపాతీ, పప్పు, పనీర్, వెజిటబుల్ కర్రీ లేదా సాంబారు, ఒకటీరెండు కర్రీలతో అన్నం పెట్టాలి. భోజనంలో ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు పెరుగు కంపల్సరీ. మొత్తం మీద రోజూవారి భోజనంలో ప్రొటీన్లు, పీచు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలంటున్నారు న్యూట్రిషనిస్ట్.
ఈ టైమ్ టేబుల్ ఫాలో అయ్యారంటే - జీవితంలో 'సెట్' అయినట్లే!
స్నాక్స్‌లో ఏవంటే : లంచ్‌కు డిన్నర్‌కు మధ్యలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని అందించాలి. అంటే బాదం, అక్రోట్లు, గుమ్మడి, సన్‌ఫ్లవర్ గింజలు వంటివి ఇవ్వాలి. అలాగే, విటమిన్లూ ఖనిజాలూ అధికంగా ఉండే అరటి, ఆపిల్, కమలా, జామ వంటి ఫ్రెష్ పండ్లూ లేదా వాటితో చేసిన స్మూతీ, సలాడ్లూ ఇస్తే మేలు అంటున్నారు. పండ్లు పరీక్షల వేళ ఒత్తిడినీ తగ్గించి హెల్దీగా ఉంచుతాయి. కాబట్టి, కనీసం డైలీ రెండుమూడైనా ఇచ్చేలా చూసుకోవాలి.
అవి కూడా సీజనల్‌వీ స్థానికంగా దొరికేవీ చాలట. అందులోనూ జామ మరీ మంచిదంటున్నారు. ముఖ్యంగా కౌమారదశలోని పిల్లలకు ఐరన్ చాలా అవసరం. అది లోపిస్తే త్వరగా అలసిపోయి శ్రద్ధగా చదవలేరని సూచిస్తున్నారు. ఇవేకాకుండా పెరుగులో అరటిపండు, కొన్ని నట్స్ కలిపి ఇచ్చినా మంచిదే. త్వరగా ఆకలి వేయదని చెబుతున్నారు. లేదంటే ఓట్స్, నట్స్, ఎండుఫలాలతో చేసిన ఎనర్జీ బార్స్, పల్లీ, నువ్వులు, డ్రైఫ్రూట్ లడ్డూలు పెట్టినా ఆరోగ్యానికి మేలే అంటున్నారు.
మరికొన్ని!
- ముఖ్యంగా పిల్లల డైట్లో పీచు ఆధికంగా ఉండే ఆహారాన్ని చేర్చాలి. పరీక్షకి ముందు అరటిపండు, నట్స్ వంటివి ఇవ్వొచ్చు. వీటివల్ల రక్తంలో చక్కెర నిల్వలు సరిపడా ఉండి కన్ఫ్యూజన్ లేకుండా చదవడం, రాయడం చేస్తారంటున్నారు డాక్టర్ లతాశశి.
- పరీక్షల టైమ్‌లో ఒత్తిడి వల్ల ఆకలిగా ఉండదు. అయినా, పిల్లలు రోజుకి మూడుసార్లు తినేలా చూడాలి. రాత్రి 8 గంటలకి ముందే తక్కువ మోతాదులో డిన్నర్ ముగించాలి. టైమ్‌కి తినాలి. నిద్రపోవాలి. మేలుకోవాలి. అప్పుడే వాళ్లు ఎగ్జామ్స్ సరిగ్గా రాయగలరని సూచిస్తున్నారు.
10వ తరగతి పరీక్షలు రాయడం ఇక సులువే - ఈ ట్రిక్స్ పాటిస్తే అంతా సెట్
తాగే నీటి విషయంలో: తాగే నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లతాశశి. రోజును మంచినీళ్లతోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని విద్యాసంస్థల హాస్టళ్లలోనూ ఈ నియమాన్ని పెట్టాక మంచి ఫలితాలు వచ్చాయట. కాబట్టి, డైలీ తగినంత వాటర్ తాగేలా చూసుకోవాలి. ఏమాత్రం డీహైడ్రేషన్‌కు గురైనా కండరాల్లో అలసట, తలనొప్పి వస్తాయి. దాంతో పరీక్షలు సరిగ్గా రాయలేరు. వీలైతే పరీక్ష హాల్లోకీ ఓ బాటిల్ మంచినీళ్లు తీసుకెళ్లాలి. పరీక్ష మధ్యలో వాటర్ తాగిన పిల్లలు మిగిలినవాళ్లకన్నా ఐదు శాతం బాగా రాసినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయని వివరిస్తున్నారు.
ఇవి వద్దు!
- పరీక్షల టైమ్‌లో పిల్లలకు అధిక పిండి పదార్థాలతో కూడిన ఆహారం, ఆయిల్ ఫుడ్ పెట్టొద్దు. అలాగే, పంచదార, ఉప్పు తగ్గించాలి.
- అదేవిధంగా ప్రాసెస్డ్, జంక్, ఫాస్ట్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్, వడాపావ్, సమోసా వంటి వాటికి దూరంగా ఉంచాలి. ఎందుకంటే, మనదేశంలో ఒత్తిడి కారణంగా మామూలుగా కన్నా ఎగ్జామ్స్ టైమ్‌లో 30 శాతం ఎక్కువ జంక్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారట. దాంతో అధ్యయన, జ్ఞాపకశక్తి సామర్థ్యాలు తగ్గిపోవడంతోపాటు భవిష్యత్తులో ఊబకాయం, హృద్రోగాల బారినపడుతున్నట్లు పరిశోధనలు పేర్కొంటున్నాయి.
- కొందరు నిద్ర రాకుండా ఉంటుందని పిల్లలకు టీ, కాఫీ ఇస్తుంటారు. కానీ, వాటికి బదులుగా తాజా పండ్లూ పండ్లరసాలూ ఇవ్వడం మంచిదంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.