Party President Wives Focus on Politics : ఈసారి ఎన్నికల్లో ముగ్గురు మహిళామణులు కీలకంగా మారారు. భర్తలు జైల్లో ఉన్నా, తమ రాజకీయ పార్టీల బలోపేతం కోసం పట్టుదలతో పోరాడుతున్నారు సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్!! ఓ వైపు భర్తల తరఫున కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ప్రజాతీర్పును కోరుతూ జన క్షేత్రంలోనూ అలుపెరగకుండా దూసుకుపోతున్నారు. రానున్న రోజుల్లో వీరిద్దరూ దిల్లీ, ఝార్ఖండ్ సీఎం పీఠాలపై కొలువుతీరినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ సైతం తన మరదలు, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేను ఢీకొంటున్నారు.
భార్యాభర్తలిద్దరూ ఐఆర్ఎస్ ఆఫీసర్లే
లిక్కర్ స్కాం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తిహాడ్ జైలులో ఉన్నారు. ఈ పరిణామాలతో అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలోని అరవింద్ కేజ్రీవాల్ కుర్చీలో కూర్చొని వీడియో సందేశాలను విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క ఆప్ నేత కూడా ఆ ఛైర్‌లో కూర్చొని సందేశం రిలీజ్ చేయలేదు. దీన్ని పరిశీలిస్తే తదుపరి దిల్లీ ప్రభుత్వంపై పూర్తి పట్టు తన భార్యకే ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ కోరుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఇటీవల దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి సభలోనూ సునీతా కేజ్రీవాల్ చక్కగా ప్రసంగించి భళా అనిపించారు. దిల్లీ సీఎం రేసులో ఆమె ముందంజలో ఉన్నారనేందుకు ఇవన్నీ గ్రీన్ సిగ్నల్స్ అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే కేజ్రీవాల్‌కు సపోర్ట్
సునీతా కేజ్రీవాల్ 1994 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి. అరవింద్ కేజ్రీవాల్ 1995 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ శిక్షణా కార్యక్రమంలో తొలిసారి వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ వెంటనే 1994 నవంబరులో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే అరవింద్ కేజ్రీవాల్‌కు సునీత అన్నిరకాల సహాయ సహకారాలను అందించారు. అన్నా హజారేతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలోనూ సునీత పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వారణాసి లోక్‌సభ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. ఆ సమయంలో తన ఉద్యోగానికి లీవ్ పెట్టి మరీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రచారానికి సునీత సహాయం చేశారు. 2015లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యారు. ఈ పరిణామం జరిగిన ఏడాది తర్వాత 2016లో సునీత తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్‌కు ముందు ఆమె చివరి పోస్టింగ్ దిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అడిషనల్ కమిషనర్. 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం గురించి అప్పట్లో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఈ విజయం వెనుక తన భార్య సహకారం కూడా ఉందని వెల్లడించారు.
బైపోల్ బరిలో కల్పనా సోరెన్- గెలిస్తే సీఎం?
కల్పనా సోరెన్ ఈమె ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను కూడా కొన్ని నెలల క్రితమే ఈడీ అరెస్టు చేసింది. అయితే అరెస్టయిన వెంటనే సీఎం పదవికి హేమంత్ రాజీనామా చేశారు. దీంతో వెంటనే కల్పనా సోరెన్‌ను సీఎం చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా హేమంత్ సోరెన్‌కు విశ్వాసపాత్రుడిగా పేరొందిన చంపయీ సోరెన్‌కు సీఎం సీటును కట్టబెట్టారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్టులకు నిరసనగా ఇటీవల దిల్లీలో విపక్ష ఇండియా కూటమి నిర్వహించిన సభలో కల్పనా సోరెన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి సునీత కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు కల్పన. ఈ ఎన్నికల్లో కల్పన, సునీత పరస్పరం పార్టీల అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశాలు లేకపోలేదు.