Loksabha Elections 2024 BJP Campaign Topics : భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లో బిగ్ స్కెచ్, బిగ్ టార్గెట్‌తో బరిలోకి దిగుతోంది. బిగ్ టార్గెట్ అంటే 370 లోక్‌సభ సీట్లు!! ఇండియా కూటమి పక్షాలను చిత్తుచేసి ఎన్డీయే పక్షాలు దేశవ్యాప్తంగా పైచేయి సాధించేలా చేయడమే బిగ్ స్కెచ్!! ఎన్డీయే కూటమిలోని పార్టీలు కూడా బాగా రాణిస్తే 400 సీట్ల మార్కును ఈజీగా దాటుతామనే ధీమాతో మోదీసేన ఉంది. ఈక్రమంలో దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు కమలదళం ప్రజల్లోకి తీసుకెళ్లనున్న టాప్-10 అంశాలేంటో ఓసారి పరిశీలిద్దాం
అయోధ్య రామ మందిరం
అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో నవ్య భవ్య రామమందిరాన్ని నిర్మించాలనేది భారతదేశంలోని హిందువుల ఐదు వందల ఏళ్ల నాటి కల. దాన్ని సాకారం చేసిన ఘనత కచ్చితంగా బీజేపీ సర్కారుదేనని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ సేన అంత దూకుడును ప్రదర్శించలేదు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూకుడును పెంచింది. ఈక్రమంలోనే చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది అయోధ్య రామమందిర అంశం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.
ఇక ప్రత్యేకమైన ట్రస్టును ఏర్పాటు చేసి, దాని ద్వారా మందిరాన్ని నిర్మించింది. స్వయంగా ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కేంద్ర ప్రభుత్వ మీడియాలోనూ ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ వేడుకను బీజేపీ పెద్దఎత్తున జనంలోకి తీసుకెళ్లింది. ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని వాడుకొని దేశంలోని మెజారిటీ వర్గానికి చేరువయ్యేలా కమలదళం కసరత్తు చేయనుంది. ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఈ అంశం కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.
ఆర్టికల్ 370
మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఆర్టికల్ వల్ల జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. అయితే 2019 ఆగస్టు 5న మోదీ సర్కారు ఆర్టికల్ 370ని రద్దు చేసింది. మోదీ సర్కారుకు పూర్తి మెజారిటీ ఉండటంతో దీనికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. 2014 సంవత్సరం నుంచే ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ వచ్చింది.
చివరకు ఆ దిశగా నిర్ణయాన్ని తీసుకొని అందరినీ ఆశ్చర్యపర్చింది. భారత రాజ్యాంగాన్ని కశ్మీర్‌కు వర్తింపజేయాలని సూచించే క్లాజ్ 1 మినహా ఆర్టికల్ 370లోని అన్ని నిబంధనలను మోదీ సర్కారు రద్దు చేసింది. దీంతో దశాబ్దాలుగా కశ్మీర్‌లో హింసను చవిచూసిన కశ్మీరీ పండిట్లు హర్షం వ్యక్తం చేశారు. మోదీకీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుందనే కోణంలో ఈ అంశాన్ని జనంలోకి కమలదళం తీసుకెళ్లనుంది.
పౌరసత్వ సవరణ చట్టం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కూడా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల్లో ఒకటి. సీఏఏ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు 2019లోనే ఆమోదించింది. అయితే అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం వల్ల అమలును వాయిదావేసింది. ఆ వెంటనే దేశాన్ని కరోనా సంక్షోభం చుట్టుముట్టింది. ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి కొన్ని రోజుల ముందు సీఏఏ అమలుకు సంబంధించిన నిబంధనలను రిలీజ్ చేసింది. దీంతో సీఏఏ అమల్లోకి వచ్చేసింది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి మనదేశంలోకి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించడం తమ ప్రభుత్వ విజయమని బీజేపీ ఎన్నికల్లో చెప్పుకోనుంది. తమ విధానాలన్నీ ముస్లిమేతరులకు అనుకూలమైనవే అనే సంకేతాన్ని దేశంలోని మెజారిటీ వర్గంలోకి పంపనుంది.
యూనిఫామ్ సివిల్ కోడ్
దేశంలోని అన్ని మతాలు, కులాలు, తెగలకు చెందిన వారికి అన్ని విషయాల్లోనూ ఒకే విధమైన చట్టాలను అమల్లోకి తెచ్చేందుకు వీలు కల్పించేదే యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ). యూసీసీని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ రాష్ట్రంలోనూ గత నెల చివరి వారం నుంచే యూసీసీ అమల్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ యూసీసీని అమలు చేస్తామనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపేందుకే ఉత్తరాఖండ్‌లో దాన్ని అమల్లోకి తెచ్చారని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే తదుపరిగా యూసీసీని అమలు చేసేందుకు గుజరాత్, అసోం ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ యూసీసీ చట్టాన్ని చేస్తామని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
ట్రిపుల్ తలాక్
ముస్లింలోని మహిళా ఓటు బ్యాంకుపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసమే 2019లో ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించింది. దీని ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తలపై మోదీ సర్కారు కొరడా ఝుళిపించింది. ట్రిపుల్ తలాక్ చెప్పడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. భార్యలకు ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తలకు గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలని చట్టం నిర్దేశిస్తోంది. ఇది కూడా బీజేపీ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ముస్లిం మహిళల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఈసారి ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోనుంది. ముస్లిం మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఆపడమే తమ లక్ష్యమని కమలదళం ప్రచారం చేయనుంది.