Zakir Hussain Last Rites : ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అంత్యక్రియలు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోలో జరిగాయి. తమ అభిమాన విద్వాంసునికి వందలాదిమంది కన్నీటి వీడ్కోలు పలికారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడిన 73ఏళ్ల జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16న తుదిశ్వాస విడిచారు. గురువారం శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని ఫెర్న్‌వుడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. డ్రమ్స్ మ్యాస్ట్రో శివమణి, మరికొందరు కళాకారులు తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్‌కు సంగీత నివాళి అర్పించారు.
VIDEO | Tabla maestro Zakir Hussain was laid to rest in San Francisco. Drummer Anandan Sivamani attended the funeral in the US city.
— Press Trust of India (@PTI_News) December 20, 2024
Hussain, one of the world's most accomplished percussionists, died at a San Francisco hospital on Monday due to complications arising from… pic.twitter.com/N0sB6fW8R0
తబలా మ్యాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. ఏడేళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చిన ఆయన, ఎన్నో వందలాది ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనేక అల్బమ్‌లు సైతం చేసి 1980వ దశకంలో పలు చిత్రాలకూ పని చేశారు జాకీర్.
1990లో కేంద్ర ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2018లో రత్న సదస్యను అందుకున్నారు. మిక్కీ హార్ట్, గియోవన్నీ హిడాల్గోతో కలిసి గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ సంగీత ఆల్బమ్ విభాగంలో జాకీర్ గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో మూడు గ్రామీలను కూడా స్వీకరించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ఆయనను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. 1999లో యూఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్‌తో జాకీర్ హుస్సేన్‌ను సత్కరించారు. ఆ తర్వాత ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు.
ఇదిలా ఉండగా, జాకీర్ హుస్సేన్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. తద్వారా తొలిసారిగా వైట్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడిగా జాకీర్ హుస్సేన్ గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతోపాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. జాకీర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.
3ఏళ్లకే తబలా, 7ఏళ్లకే ప్రదర్శనలు : జాకీర్ హుస్సేన్ సాధించిన రికార్డులివే