India US Defence Relationship : భారత్-అమెరికా మధ్య ఉన్న రక్షణ సంబంధాలు వేగంగా, ఉత్తేజకరమైన, అద్భుతమైన రీతిలో పురోగమిస్తున్నాయని పెంటగాన్ పేర్కొంది. అమెరికా పగ్గాలు త్వరలో జో బైడెన్ నుంచి ట్రంప్ చేతిలోకి మారనున్న నేపథ్యంలో పెంటగాన్ ఈ కీలక ప్రకటన చేయడం విశేషం.
"భారత్- అమెరికా మధ్య మంచి రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇది రక్షణ పారిశ్రామిక సహకారంతో పాటు కార్యాచరణ సహకారానికి సంబంధించింది. ఇది అద్భుతమైన, ఉత్తేజకరమైన మార్గాల్లో వేగంగా పురోగమిస్తోంది" అని ఇండో పసిఫిక్ భద్రతా వ్యవహారాల కార్యదర్శి ఎలీ రాట్నర్ ఎలీ రాట్నర్ తెలిపారు. భారత్-చైనా మధ్య ఉన్న సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో, భారత్-అమెరికా రక్షణ సంబంధాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు సమాధానంగా రాట్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌కు అమెరికా అటామిక్ ఎయిర్‌క్రాఫ్ట్స్
అమెరికా భారత్‌కు - 31 జనరల్ అటామిక్ MQ-9B (16 స్కై గార్డియన్, 15 సీ గార్డియన్) రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అందించేందుకు వీలుగా అక్టోబర్‌లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది భారత నిఘా వ్యవస్థ (ఐఎస్‌ఆర్)ను మరింత బలోపేతం చేయనుంది. ఫలితంగా భారత సాయుధ దళాల సామర్థ్యాలు మరింత మెరుగవనున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్‌లో సమావేశమై ఇరుదేశాల రక్షణ సంబంధాల గురించి చర్చించారు. అందులో భాగంగా భారత్ - అమెరికాలు ఈ సంవత్సరం తమ రక్షణ వస్తువులు, సేవల పరస్పర సరఫరాను పెంపొందించుకునేందుకు వీలుగా 'సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్‌మెంట్' (SOSA)ను కూడా చేసుకున్నాయి.
భారత్‌కు చెందిన సంస్థపై అమెరికా ఆంక్షలు
మరోవైపు భారత్‌కు చెందిన అట్లాంటిక్ నావిగేషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరానియన్ పెట్రోలియం, పెట్రో కెమికల్స్‌తో కలిసి వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తూ, భారత దేశానికి చెందిన ఈ సంస్థపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. దీంతోపాటు ఇరాన్‌కు బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుస్తున్న నాలుగు సంస్థలు, మూడు నౌకలపై కూడా ఆంక్షలు విధించినట్లు ట్రెజరీ శాఖ పేర్కొంది. టెహ్రాన్ తన అణు కార్యక్రమాల అభివృద్ధికి, ఆయుధ వ్యవస్థల విస్తరణకు దాని ప్రాక్సీలకు మద్దతు ఇచ్చేందుకు ఈ నౌకలు, కంపెనీలపై ఆధారపడుతోందని వెల్లడించింది.