Lok Sabha Election 2024 :హరియాణాలో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నాయి. హరియాణాలో ఎవరు అధికారం చేపట్టాలన్నా, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్నా జాట్‌ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి. 58 ఏళ్ల హరియాణా రాష్ట్ర చరిత్రలో 33ఏళ్లపాటు జాట్ నేతలే సీఎంలుగా ఉన్నారంటే ఇక్కడ వారి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సాంప్రదాయంగా జాట్‌లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుండగా ఇన్నాళ్లు ఓబీసీల అండతో నెట్టుకొస్తున్న బీజేపీ జాట్‌లను తమ వైపునకు తిప్పుకుని ఈసారి అధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది.
హరియాణాలో ఏ ఎన్నికలు జరిగినా ఆ ఫలితాలను జాట్‌లే నిర్దేశిస్తారు. జాట్‌లు ఎవరి వైపు మొగ్గు చూపుతాయో ఆ పార్టీలు ఇక్కడ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటాయి. వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన హరియాణాలో రైతులంటే జాట్‌లు జాట్‌లంటే రైతులు అనేలా పరిస్థితి ఉంటుంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతోపాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ రైతు పోరాటాలకు జాట్‌లే నేతృత్వం వహిస్తారు. రైతు సమస్యల పరిష్కారానికి జాట్‌లు చేస్తున్న పోరాటంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, జాట్‌లకు మధ్య దూరం పెరిగింది. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు సార్వత్రిక ఎన్నికల వేళ జాట్‌ల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ జాట్‌లు ఎటు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. తమ ఆందోళనల పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపుతుందనే కోపం హరియాణా జాట్‌లలో స్పష్టంగా కనిపిస్తోంది. జన్‌నాయక్ జనతా పార్టీ JJPపై కూడా జాట్‌లు చాలా కోపంగా ఉన్నారు.
బీజేపీపై జాట్‌ల తీవ్ర వ్యతిరేకత
సార్వత్రిక ఎన్నికల సమరంలో తమ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ, JJP అగ్రనేతలు చేస్తున్న ప్రచారంలో జాట్‌ల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గ్రామాల్లోకి ఈ పార్టీల నేతలు ప్రచారానికి వెళ్లినప్పుడు స్థానిక జాట్ నేతలు రైతు సమస్యలపై నిలదీస్తున్నారు. సోనీపత్‌లోని దహియా ఖాప్ పరిధిలో ఉన్న 24 గ్రామాల ప్రజలు బీజేపీని బాయ్‌కాట్ చేశారు. సిర్సాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫతేహాబాద్‌లో బీజేపీ నేత అశోక్ తన్వర్ ర్యాలీల్లో రైతులు నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నారు. జాట్‌ల ప్రాబల్యమున్న హిసార్‌లోని నారాలో ప్రజలు మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌటాలాను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. రైతు సమస్యల పరిష్కారంతోపాటు జాట్ నేతలపై నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆరోపణలతో బీజేపీపై ఆ వర్గ ప్రజలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక జాట్ నేతలను బీజేపీ మచ్చిక
జాట్‌ల నుంచి ఈ స్థాయి వ్యతిరేకతతో బీజేపీ ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడింది. దీని నుంచి బయటపడటానికి స్థానిక జాట్ నేతలను మచ్చిక చేసుకునే పనిలో కమలం పార్టీ నిమగ్నమైంది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ వర్గాలను ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. జాట్‌ల మద్దతు లేకపోయినా జాటేతరులు, ఓబీసీల అండతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గుకురావాలని బీజేపీ చూస్తోంది. గత రెండు ఎన్నికల్లో మిగిలిన అన్ని వర్గాల ఓట్లను సాధించడంద్వారా జాట్‌ల ఓట్లకు ప్రాధాన్యం లేకుండా బీజేపీ చేయగలిగింది. ఇటీవలే పంజాబీ వర్గానికి చెందిన ఖట్టర్‌ను తప్పించి ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది. అయితే జేజేపీతో విడిపోవడం బీజేపీకి ఇబ్బందికరంగా ఉంది. జేజేపీ కూడా లేకపోవడం వల్ల జాట్ ఓటర్లను బీజేపీ ప్రభావితం చేయలేకపోతోంది. పదేళ్లుగా హరియాణను పాలిస్తున్నా జాట్‌లలో విశ్వసనీయతను సాధించడంలో బీజేపీ విఫలమైంది. ప్రముఖ జాట్ నేతలైన ఓపీ ధన్‌ఖడ్, కెప్టెన్ అభిమన్యులను లోక్‌సభ ఎన్నికల్లో పట్టించుకోకపోవడమూ బీజేపీకి ఇబ్బందికరంగానే మారింది. మరో జాట్ నేత బీరేంద్ర సింగ్ ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.