Baharampur Lok Sabha Polls 2024 :కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపుర్ లోక్‌సభ స్థానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరి 1999 నుంచి ఇక్కడ జయకేతనం ఎగురవేస్తూ వస్తున్నారు. బహరంపుర్ నుంచి 5 సార్లు ఎంపీగా ఆయన గెలుపొందారు. ఈసారి అధీర్ రంజన్‌కు పోటీగా క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ను తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దింపింది. గుజరాత్‌కు చెందిన యూసఫ్ పఠాన్ బంగాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్‌కు ప్రత్యర్థిగా ఉన్నారు.
అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి 2021లోనే రిటైరైన పఠాన్ ప్రస్తుతం బహరంపుర్ లోక్‌సభ స్థానంపై పూర్తి దృష్టిసారించారు. బహరంపుర్‌లో ఐదుసార్లు నెగ్గిన అధీర్ రంజన్ ఈసారి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం, కార్మికుల వలసలు అక్కడ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. గత దశాబ్దకాలంలో బహరంపుర్ అభివృద్ధికి అధీర్ రంజన్ పెద్దగా చేసింది ఏమీ లేదని కొంత మంది స్థానికులు వాపోతున్నారు. అధీర్ రంజన్, యూసఫ్ పఠాన్‌కు బీజేపీ అభ్యర్థి నిర్మల్ చంద్ర సాహ సవాలు విసురుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రముఖ వైద్యుడిగా నిర్మల్ చంద్రకు పేరుంది.
జనాభాలో 66 శాతం ముస్లింలే!
తక్కువ ఖర్చుకే నిపుణులైన కార్మికులను దేశం మొత్తానికి సరఫరా చేసే ప్రాంతంగా ముర్షిదాబాద్‌కు అపఖ్యాతి ఉంది. బహరంపుర్ లోక్‌సభ స్థానంలో ఉన్న జనాభాలో 66 శాతం ముస్లింలే. 13.9 శాతం ఎస్సీలు, 0.9 శాతం ఎస్టీలు ఇక్కడ ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో ఆరింటిలో తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందింది. ఒకదాంట్లో బీజేపీ నెగ్గింది. ఐతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా బహరంపుర్ లోక్‌సభ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది.
బహరంపుర్‌లో ఐదుసార్లు ఎంపీగా గెలిచినా కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచడంలో అధీర్ రంజన్ సఫలంకాలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలే కాదు, స్థానిక ఎన్నికల్లోనూ బహరంపుర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ మాత్రం బహరంపుర్ అసెంబ్లీ స్థానాన్ని మూడేళ్ల క్రితం దక్కించుకుని తన ఉనికిని చాటుకుంది.
అధీర్ గట్టిపోటీ
66 శాతం ముస్లిం జనాభా ఉన్న బహరంపుర్ లోక్‌సభ స్థానంలో క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ను తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దింపడం కొన్ని వర్గాల ఓటర్లలో ఉత్సాహాన్ని పెంచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏ మేరకు యూసఫ్ పఠాన్ ఓట్లు రాబడతారో వేచి చూడాల్సి ఉంది. గతంతో పోలిస్తే ప్రజాదరణ బాగా తగ్గినప్పటికీ అధీర్ రంజన్ ఇంకా బహరంపుర్‌లో గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా యూసఫ్ పఠాన్ గుజరాత్ వాసి కావడం వల్ల స్థానికుడు, స్థానికేతరుడు మధ్య పోటీ అనే విషయాన్నిఅధీర్ రంజన్ ఎన్నికల ప్రచారంలో బాగా తీసుకెళ్తున్నారు. తన సొంత కుమారుడికే బహరంపుర్ ఓటు వేస్తుందని చెబుతున్నారు.