తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పుస్తక సమీక్ష: భవిష్యత్ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు దిక్సూచి ఈ 'అంశుబోధిని' - AMSHUBODHINI BOOK REVIEW

సూర్య కిరణాల గురించి అంశుబోధని గ్రంథం - మన ముందుంచిన రచయిత శ్రీ కుప్పా వేంకటకృష్ణ మూర్తి

Amshu Bodhini Book Written By kuppa Venkata Krishna Murthy
Amshu Bodhini Book Written By kuppa Venkata Krishna Murthy (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 2:05 PM IST

Updated : Dec 31, 2024, 2:39 PM IST

Amshubodhini Book Review :ఆధునిక విజ్ఞానశాస్త్రం సూర్యుడిపై పరిశోధనలకు ఉవ్విళ్లూరుతోంది. నాసా పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాలు ఇందులో భాగమే. కానీ, సూర్యుడి గుట్టు విప్పేందుకు చేపట్టిన ఈ ప్రయోగాలకంటే పలు శతాబ్దాలకు పూర్వమే ప్రాచీన భారతీయ ఋషులు సూర్యుడిపై ఎంతో పరిశోధనని చేసి, వారు కనుగొన్న రహస్యాలను మనకు వెల్లడించారు.

వారిలో భరద్వాజ మహర్షి ప్రసాదితమైన గ్రంథం ఈ 'అంశుబోధినీ' (కిరణ శాస్త్రం). సూర్య కిరణాలలో గల స్థూల, సూక్ష్మ, కారణ శక్తులచేత జగత్తు స్థూల,సూక్ష్మ,కారణ సృష్టి జరుగుతుందని ఆయన సిద్ధాంతీకరించారు. దురదృష్టవశాత్తు ఈ గ్రంథపు సింహభాగం కాలగర్భంలో కలిసిపోయి, నేటి తరానికి మొదటి అధ్యాయం మాత్రమే లభించింది. ప్రాచీన కాలంలోనే సైన్స్ ఎంతగా అభివృద్ధి సాధించిందో ఈ ఒక్క అధ్యాయం ద్వారా మనకు అవగతమవుతుంది.

అంశుబోధిని పుస్తకం (ETV Bharat)

తెలుగు పాఠకుల కోసం : పండిత శ్రీ తోగరే సుబ్బరాయశాస్త్రి 'బోధానందవృత్తి' అనే సంస్కృత వ్యాఖ్యానంతోనూ, పండిత శ్రీ వేంకటాచలశర్మ ఆంగ్ల వ్యాఖ్యానంతోనూ తొలిసారిగా ఈ గ్రంథం 1931లో బెంగళూరులో ప్రచురితమైంది. ఇప్పుడు బ్రహ్మశ్రీ కుప్పా వేంకటకృష్ణ మూర్తి గారు "అంశుబోధిని" పేరుతో దీని అనువాద వ్యాఖ్యానాన్ని తెలుగు పాఠకుల ముందుంచారు.

మూలగ్రంథాన్ని ఇంత సరళంగా తెలుగులోకి తీసుకురావడం, ముఖ్యంగా సృష్టి విజ్ఞానాన్ని 'సింహావలోకనం' పేరుతో ఫ్లోచార్ట్ ద్వారా వివరించే ప్రయత్నం వెనుక ఆయన చేసిన శ్రమ మనకి కనిపిస్తుంది. ఈ ప్రయత్నానికి రెండు ముఖ్యకారణాలు.

1) ప్రాచీన భారతీయ విజ్ఞానశాస్త్రం ఆధునిక విజ్ఞానశాస్త్రానికి ఏ మాత్రం తీసిపోదనీ, ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఇంకా ఎన్నో ఆవిష్కరణలు చేయవచ్చని భావి వైజ్ఞానిక యువతకు సూచించడం, వారిని అటువంటి పరిశోధనలకి ప్రేరేపించడం.

2) అతి జటిలంగా ఉన్న మూలాన్ని, దాని అనువాదాన్ని కూడా తెలుగు పాఠకులకు అతి సులభంగా అర్థమయ్యే రీతిలో అందించాలన్నదే రచయిత సంకల్పం.

ఈ విషయాలను తమ ఉపోద్ఘాతంలో శ్రీ మూర్తి స్పష్టంగా వివరించారు :ఈ గ్రంథాన్ని లోతుగా పరిశోధించాలంటే, ఆధునిక వైజ్ఞానిక పరిశోధనశాలలలో ప్రయోగాలతో పాటు పురాతన పారిభాషిక పదాల పైన కూడా పరిశోధనలు విస్తారంగా జరగాలి. అటువంటి అవకాశాలు, వనరులు అందుబాటులో ఉన్న సంస్థలు, వ్యక్తులు, అధికారులూ కూడా ఈ గ్రంథాన్ని ఒక ప్రాథమిక ఉపకరణంగా వినియోగించుకోవాలని రచయిత మనవిపూర్వకంగా కోరుతున్నారు.

ప్రాచీన భారతీయ విజ్ఞానంపై పరిశోధనలు చేయాలనుకునే ఔత్సాహికులతో పాటు, ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా ఈ అంశుబోధిని గ్రంథం కరదీపికగా ఉపయోగపడుతుంది. వర్తమాన సైంటిస్టుల భవిష్యత్ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు అంశుబోధిని గ్రంథం దిక్సూచిలా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. ఇంతటి బృహత్ ప్రయత్నాన్ని చేసి ఈ 'అంశుబోధిని' గ్రంథాన్ని మన ముందుంచిన రచయిత శ్రీ కుప్పా వేంకటకృష్ణ మూర్తి ఎంతైనా అభినందనీయులు.

గ్రంథం - అంశుబోధిని

⦁ రచన : - శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తి

⦁ వెల : - రూ.175/-

⦁ పేజీలు : - 224 , Emesco Publications

⦁ ప్రతులకు : - అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు

‘విక్టరీ అవర్‌’ అంటే మీకు తెలుసా? - లేదంటే ఇది చదవండి

Last Updated : Dec 31, 2024, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details