Healthy Diet Plan : "కడుపులో ఏదో ఒకటి పడితే చాలు.. ఈ పూటకి ఆకలి తీరుతుంది" అని చాలా మంది ఆహారాన్ని పట్టించుకోరు. కానీ.. పొట్ట నిండడం కంటే.. శరీరానికి కావాల్సిన మోతాదులో పోషకాలు అందాయా? లేదా? అన్నది తప్పక చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే.. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని అంటున్నారు. అయితే.. ప్రజలలో పోషకాహారంపై అవగాహన పెంచడానికి ఏటా మన దేశంలో సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారం (న్యూట్రీషియన్ వీక్) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్దీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ గురించి నిపుణులు చెబుతున్న సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మైండ్ ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ :
రోజంతా మనం చురుకుగా పనిచేయాలంటే తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. అయితే.. చాలా మంది టిఫెన్లలో పూరీ, వడ, మైసూర్ బజ్జీ, పరాటా వంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ, వీటిని తినడానికి బదులుగా ఓట్స్, జొన్నలు, హోల్ వీట్ బ్రెడ్ వంటి వాటిని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. వీటిలో డైలీ శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మధుమేహంతో బాధపడేవారు గుడ్లు, గింజలు, గ్రీక్ యోగర్ట్ వంటివి తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయులను నియంత్రణలో ఉండేలా చూసుకోవచ్చు. ప్రొటీన్లతో నిండిన ఈ ఆహారం కండరాలను బలోపేతం చేసేందుకు సాయం చేస్తుంది.
హార్ట్‌ఫుల్ లంచ్ :
దాదాపు మెజార్టీ జనాలు అన్నం ఎక్కువగా తిని, కర్రీస్ తక్కువగా తింటారు. కానీ.. కప్పు అన్నం తీసుకుంటే దానికి సమానంగా కూర తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తినడం వల్ల కూరగాయల్లో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే త్వరగా ఆకలి కాకుండా కడుపునిండిన ఫీలింగ్ కలుగుతుంది. మీరు అన్నానికి బదులుగా గోధుమ, జొన్న, సజ్జ రొట్టెల్లో ఏదైనా తినొచ్చు. వీటిలోకి సైడ్ డిష్‌గా పనీర్, పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలు తింటే మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా అందుతాయి. నాన్‌వెజ్ ప్రియులు కూరగాయలు, సలాడ్‌తో కలిపి చికెన్ తింటే హెల్దీ లంచ్ కంప్లీట్ అయిపోతుంది.
లైట్‌గా డిన్నర్ :
నైట్ టైమ్‌లో తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. చపాతీ, పుల్కా వంటివి తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే బరువు పెరగకుండా అదుపులో ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల కావాల్సినంత ఫైబర్ అందుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. సీజన్‌కు తగ్గట్లు దొరికే పండ్లతో సలాడ్లు చేసుకొని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొట్ట తేలికగా, హాయిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.