Tips to Protect Spices from Insects :ప్రతి వంటింట్లోని పోపుల డబ్బాలో వివిధ రకాల మసాలా దినుసులు తప్పకుండా ఉంటాయి. ఇక నాన్‌వెజ్ వంటకాల్లో కొన్ని రకాల మసాలా దినుసులు వేస్తేనే.. కర్రీ రుచిగా ఉంటుంది. అందుకే కిచెన్‌లో ఎప్పుడూ మసాలా దినుసులు ఉండేలా చూసుకుంటారు మహిళలు. అయితే, వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వల్ల వంటింట్లోని కొన్ని ఆహార పదార్థాలు పాడైపోతుంటాయి. ముఖ్యంగా కొన్ని మసాలా దినుసులు బూజు పట్టి పాడవుతుంటాయి. అయితే, ఈ సమయంలో కొన్ని టిప్స్ పాటించడం వల్ల మసాలా దినుసులు, పొడులు పాడైపోకుండా, పురుగులు పట్టకుండా.. తాజాగా ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో మీరూ చూసేయండి..
ఎయిర్‌టైట్ కంటెయినర్లో :ఈ సీజన్లో మసాలా దినుసులను తేమ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో అస్సలు పెట్టొద్దు. మార్కెట్లో కొన్న మసాలా దినుసులను ఎండలో ఎండబెట్టి ఎయిర్‌టైట్ కంటెయినర్లో స్టోర్ చేయండి.
నిల్వ పొడి వద్దు :ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి.. వంటి వాటిని ఎక్కువగా పొడి చేసుకుని నిల్వ ఉంచుకోకూడదు. ఎందుకంటే.. పొడులతో పోలిస్తే దినుసులు చాలా కాలంపాటు పాడవకుండా ఉంటాయి. అవసరమైనప్పుడు మిక్సీ పట్టుకుంటే ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా కూర రుచి పెరుగుతుంది.
వీటిలో వద్దు :చాలా మంది మసాలా దినుసులను ప్లాస్టిక్ కవర్లలో, స్టీలు సీసాల్లో నిల్వ ఉంచుతారు. కానీ, ఇలా కాకుండా.. వాటిని గాజు సీసాల్లో నిల్వ చేస్తే చాలాకాలం పాటు పాడవకుండా ఉంటాయట. అలాగే ఈ గాజు సీసాలను పొడిగా ఉండే ప్రాంతంలో పెట్టడం మరిచిపోవద్దంటున్నారు.
గాజు సీసాలో :కొంతమంది పసుపు, కారం, ధనియాల పొడి లాంటి వాటిని కూడా ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తుంటారు. ఇలా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి సహజ పరిమళాలు పోతాయి. అలాగే పొడి కాస్త గడ్డలా మారిపోతుంది. కాబట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకోండి.
వేడి చేయండి :మసాలా దినుసులను పాన్ లేదా అవెన్‌లో వేసి కాసేపు వేడి చేయాలి. తర్వాత వీటిని భద్రపరిస్తే ఎక్కువకాలంపాటు నిల్వ ఉంటాయి. వేటికవే విడివిడిగా స్టోర్ చేయాలని గుర్తుంచుకోండి. అవసరమున్నప్పుడు మసాలా దినుసులను ఉపయోగించిన తర్వాత జార్ మూత గట్టిగా పెట్టడం మరిచిపోవద్దు.