తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

వంట సమయంలో నూనె చిట్లి మీద పడుతోందా? - ఈ టిప్స్​ పాటిస్తే ఆ సమస్యే ఉండదు! - TIPS TO PREVENT OIL SPLATTING

-తాలింపు సమయంలో నూనె చిట్లి చేతులు, ముఖంపై పడుతోందా? -ఈ టిప్స్​ పాటిస్తే మంచిదంటున్న నిపుణులు

Tips to Prevent Oil Splatter
Tips to Prevent Oil Splatter (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2025, 10:07 AM IST

Tips to Prevent Oil Splatter: రోజులో ఎక్కువ సేపు మహిళలు గడిపేది వంటగదిలోనే. అయితే వంట చేసే క్రమంలో చేతులు కాలడం మెజార్టీ స్త్రీలకు అనుభవమే. ముఖ్యంగా వేపుళ్లు, ఇతర కూరలు, పచ్చళ్లు పోపు వేసేటప్పుడు నూనె చిట్లి చేతులు, ముఖంపై పడుతుంటుంది. దీనివల్ల ఆయా భాగాల్లో బొబ్బలెక్కడం, కాలిన మరకలు ఏర్పడడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా కిచెన్‌ టైల్స్ పైనా ఈ నూనె మరకలు పడి జిడ్డుగా మారుతుంటుంది. మరి, ఇలా జరగకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • నూనెకు, నీటికి పడదు. కాగుతున్న నూనెలో ఒక్క చుక్క నీరు పడిన చిటపటలాడుతుంది. కాబట్టి, కూరలు వండే ముందే ఆకుకూరలు, కూరగాయల్లో నీళ్లు లేకుండా చూసుకోవాలి. అందుకోసం శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసి గిన్నెలో లేదా జాలీ లాంటి పాత్రల్లో వేసుకుంటే సులభంగా ఆరిపోతాయి. తద్వారా నూనెలో వేస్తే చిట్లదని అంటున్నారు.
  • నూనె బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఇతర పదార్థాలు వేస్తుంటారు చాలా మంది. ఇలాంటి సమయాల్లో కూడా నూనె చిట్లుతుంటుంది. అలాగే అవి త్వరగా మాడిపోతాయి కూడా. కాబట్టి నూనె మరీ ఎక్కువగా వేడెక్కకుండా, కేవలం లైట్​గా హీట్​ అయ్యేలా చూసుకోవాలి.
  • తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో కూరగాయలు సహా ఇతర ఆహార పదార్థాలు నిల్వ చేస్తుంటారు. అయితే ఇలా నిల్వ ఉంచిన కాయగూరల ముక్కలు, ఇతర పదార్థాల్లో తేమ నిలిచి ఉంటుంది. కాబట్టి వాటిని వెనువెంటనే నూనెలో వేస్తే చిట్లే ప్రమాదం ఎక్కువ. అందువల్ల ముందుగానే వాటిని ఫ్రిజ్‌లో నుంచి తీసి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. వాటిలోని చల్లదనం తగ్గాక వాడితే సమస్య ఉండదని సూచిస్తున్నారు.
  • నూనె చిట్లకుండా అందులో కొద్దిగా ఏదైనా పిండి, చిన్న చిన్నబ్రెడ్‌ ముక్కలు వంటివి వేసినా ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. ఇవి ఆయా పదార్థాల్లోని తేమను గ్రహించి నూనె చిట్లకుండా చేస్తాయని చెబుతున్నారు. అలాగని మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా చల్లుకోవడం మంచిదంటున్నారు.
  • ఒక్కోసారి తొందరలో తడిగా ఉన్న పాత్రలోనే నూనె పోస్తుంటాం. దీనివల్ల కూడా నూనె చిట్లుతుంటుంది. కాబట్టి పాత్ర పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నూనె పోయడం మంచిదని వివరిస్తున్నారు.
  • చాలా మంది వంట త్వరగా పూర్తి కావాలన్న ఉద్దేశంతో హై ఫ్లేమ్​లో వంటలు చేస్తుంటారు. దీనివల్ల నూనె బాగా వేడెక్కి చిట్లుతుంది. దీంతో పాటు కూర కూడా మాడిపోతుంది. అందుకే తక్కువ మంటపై వండితేనే అటు రుచి, ఇటు సురక్షితమని సలహా ఇస్తున్నారు.

ఇవి మంచివే:

  • నూనె చిట్లి మీద పడకుండా గ్లోవ్స్‌ ధరించడం, పొడవాటి స్లీవ్స్‌ ఉన్న దుస్తులు వేసుకోవడం, గరిట హ్యాండిల్‌ పొడవుగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
  • కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ బర్నర్స్‌, స్టౌ వెనక వైపున్న టైల్స్‌, ర్యాక్స్‌పై నూనె మరకలు పడకుండా ఉండేందుకు ఆయా ప్రదేశాలు, వస్తువులపై బేకింగ్‌ షీట్స్‌ అతికించవచ్చని సూచిస్తున్నారు.
  • నూనె చిట్లి మీద పడకుండా, కిచెన్ ప్లాట్‌ఫామ్ జిడ్డుగా మారకుండా ఇప్పుడు వివిధ రకాల గ్యాడ్జెట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిని కూడా వినియోగించవచ్చని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details