Rice Benefits for House in Telugu: బియ్యం అనగానే అన్నం వండుకుంటాం అని టక్కున చెప్పేస్తుంటారు చాలా మంది. మరికొందరు దోశ, పిండి వంటల కోసం ఉపయోగిస్తుంటాం అని చెబుతుంటారు. ఈ విషయాలు సాధారణంగా అందరికీ తెలిసినవే. కానీ కేవలం ఇవే కాకుండా చాలా రకాల ఇంటి అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. బియ్యాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
- మనం నిత్యం వాడే మొబైల్ ఫోన్, రిమోట్ లాంటి ఎలక్ట్రానిక్ పరికాలు అప్పుడప్పుడూ పొరపాటున నీళ్లలో పడిపోవడమో లేదంటే వర్షంలో తడవడమో జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో వీటిని బియ్యం నింపిన డబ్బాలో పెట్టి బియ్యంతో కప్పి సుమారు రెండు గంటల పాటు ఉంచాలట. ఇలా చేయడం వల్ల వాటిలోని తేమను బియ్యం పీల్చుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
- కిచెన్ కప్‌బోర్డులు, రిఫ్రిజిరేటర్ల నుంచి కూడా అప్పుడప్పుడూ దుర్వాసనలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో బియ్యం నింపిన ఓ గిన్నెను ఫ్రిజ్, ఆయా అల్మరాల్లో ఓ మూలన ఉంచితే ఆ వాసనను బియ్యం పీల్చేసుకుంటుందని వివరిస్తున్నారు.
- మనకు నిత్యావసర వస్తువైన ఉప్పుకు తడి తగిలితే గట్టి పడుతుంది. కానీ, అలా జరగకుండా ఉండాలంటే అందులో కొన్ని బియ్యపు గింజలు వేస్తే ఇలా జరగదని చెబుతున్నారు.
- అయితే, చాలా మంది మామిడి, సీతాఫలం.. వంటి పండ్లను త్వరగా పక్వానికి తీసుకురావడానికి కొన్ని రకాల రసాయనాలను పెట్టి మాగబెడుతుంటారు. అలాకాకుండా వాటిని బియ్యంలో కప్పి పెడితే రసాయనాలు లేకుండా సహజంగానే అవి త్వరగా పండుతాయని నిపుణులు చెబుతున్నారు.
- ఇంకా బియ్యం కడిగిన నీళ్లను కాయగూరలు, పండ్లను శుభ్రం చేసుకోవడానికి వాడుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆ నీళ్లలో కాయగూరలు, పండ్లను పావుగంట పాటు ఉంచిన తర్వాత.. ఆపై సాధారణ నీటితో మరోసారి క్లీన్ చేస్తే సరిపోతుందని వివరిస్తున్నారు.
- ఈ రోజుల్లో ఇంట్లో పెంచే మొక్కలకు సహజ ఎరువులుగా అరటి తొక్కలు, కోడిగుడ్ల పెంకులు వాడుతుంటారు. అయితే కేవలం ఇవే కాకుండా బియ్యాన్ని ఉడికించిన నీరు (గంజి)ను కూడా మొక్కలకు ఎరువుగా కూడా వాడచ్చని చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు మొక్కల్ని చీడపీడల నుంచి రక్షిస్తాయని వివరిస్తున్నారు.
- తేమ వల్ల కత్తులు, కత్తెర లాంటి కొన్ని ఇనుప వస్తువులు తుప్పు పడుతుంటాయి. అయితే వీటిని బయట కాకుండా బియ్యం నిల్వ ఉంచే డబ్బాలో ఉంచితే ఈ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.
- అలాగే తేమ ప్రభావం వెండి ఆభరణాల పైనా ఉంటుంది. ఫలితంగా అవి కళ తప్పినట్లుగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఒక మెష్ బ్యాగ్‌లో బియ్యాన్ని నింపి.. వీటిని భద్రపరిచే బాక్సులో ఉంచితే ఆ తేమను బియ్యం పీల్చేసుకుంటుందని సూచిస్తున్నారు. అలాగే నిర్ణీత వ్యవధుల్లో ఈ బియ్యాన్ని మార్చడం మర్చిపోవద్దని సలహా ఇస్తున్నారు.