Nayanthara: Beyond the Fairytale Review : ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ధనుశ్‌ను విమర్శిస్తూ హీరోయిన్ నయనతార ఓపెన్ లెటర్ రాసి విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. నయన్ జీవిత ఆధారంగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్. అయితే ఈ డాక్యుమెంటరీలో నయనతార, ఆమె విఘ్నేశ్ కలిసి పని చేసిన తొలి చిత్రం నానుమ్ రౌడీ దాన్ (తెలుగులో నేనూ రౌడీనే)లోని కొన్ని సెకన్ల సీన్స్, మ్యూజిక్‌ను చూపించాలనుకున్నారు. కానీ చిత్ర నిర్మాత అయిన హీరో ధనుశ్ దానికి అంగీకరించకపోవడం వల్ల, పర్మిషన్ కోసం దాదాపు రెండేళ్ల పాటు ఎదురు చూసిన నయనతార సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది. అయితే తాజాగా ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది? మరి నానుమ్ రౌడీదాన్ సన్నివేశాలను కూడా చూపించారా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సినీ కెరీర్‌తో మొదలు - నయనతార లైఫ్‌ను ఒక అందమైన కథలా చెప్పే ప్రయత్నం చేసింది నెట్‌ఫ్లిక్స్. ఎలాంటి గందరగోళం లేకుండా నయనతరా ఫ్యామిలీని, ఆమె చిన్నప్పటి ఫొటోలు, చదువు ఇతర విషయాలను చెబుతూ ప్రారంభ సన్నివేశాలను చూపించింది. చిన్నప్పుడు అస్సలు సినిమాలు చూసేదాన్ని కాదని, ఎప్పుడైనా బంధువులు వస్తే వెళ్లేదానినని నయన్ ఈ సందర్భంగా చెప్పారు. నగల దుకాణం వ్యాపార ప్రకటన చూసి, సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? మలయాళం నుంచి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా ప్రవేశించింది వంటి విషయాలను ఆయా దర్శకులతో చెప్పించారు.
బాడీ షేమింగ్ విమర్శలు - కెరీర్ ప్రారంభంలో నయనతార ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను చూపించారు. ముఖ్యంగా గజినీ సినిమా సమయంలో ఎందుకు విమర్శలు వచ్చాయి? పత్రికలు, ఇండస్ట్రీలోని వాళ్లు తనను ఎలా బాడీ షేమింగ్ చేశారో చెబుతూ బాధపడిన సందర్భాలను కూడా చూపించారు. అప్పుడు ధైర్యం చేసి బిల్లా సినిమా కోసం బికినీ వేసుకుని నటించడం వంటి సాహసాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీ, జనాలు చేసిన విమర్శలే తాను రాటు దేలడానికి ఎలా కారణమయ్యాయో వివరించారు.
మనసు ముక్కలైన సందర్భం - సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి వచ్చే రూమర్స్, తమపై ఎలా ప్రభావితం చేస్తాయి? దీని వల్ల ఎంతటి నిరాశ నిస్పృహలకు లోనవుతారు? తారల మధ్య ఉండే బంధాలపై వచ్చే వార్తలను చూస్తే ఎలాంటి మనోవేదనకు గురవుతారన్న విషయాలను నయనతార చెప్పారు. తాను ఎదుర్కొన్న ఇంలాంటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చెప్పారు.
'ఒక వ్యక్తితో బంధం నమ్మకంపై కొనసాగుతుంది. అవతలి వ్యక్తి కూడా మనల్ని ప్రేమిస్తున్నారని నమ్ముతాం. అలాగే బంధం కొనసాగుతుంది. వారి కోసం ఏమైనా చేస్తాం. జనాలు చాలా ఊహించుకుంటారు. నా మనసు ముక్కలైన విషయం ఏంటంటే, ప్రజలు వాళ్లకు నచ్చినట్లు ఊహించుకోవడమే' అంటూ నయనతార భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా 'జనాలు ఎప్పుడూ మగాళ్లను (హీరోలు) ఏమీ అడగరు. కేవలం మహిళలను (హీరోయిన్‌లు) మాత్రమే ప్రశ్నిస్తుంటారు. నటీమణులు మాత్రమే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు, వాళ్లు మాత్రమే ప్రేమిస్తున్నట్లు రాస్తారు' అంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు.
రెట్టించిన ఉత్సాహంతో - వ్యక్తిగత జీవితంలో, సినిమాల్లో విమర్శలతో అవకాశాలు కోల్పోయిన తర్వాత, మళ్లీ తిరిగి తాను ఎలా ట్రాక్‌లోకి వచ్చారన్న సంగతులు తెలియజేశారు నయనతార. అవకాశాలు తగ్గిన సమయంలో నాగార్జున ఫోన్ చేసి బాస్ సినిమా కోసం అడగటం, రిలేషన్‌షిప్ దెబ్బతిని బాధపడుతున్న సమయంలో శ్రీరామరాజ్యంలో అవకాశం రావడం, అందరూ ఆ చిత్ర బృందం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాసినప్పుడు నయనతార పడిన మానసిక క్షోభ సహా తదితర విషయాలను కూడా ఆయా నటీనటులు, నిర్మాతలతో చెప్పించారు.
మరీ ముఖ్యంగా సీత పాత్ర చేసినన్ని రోజులు నయనతార ఎంతో నిష్ఠగా ఉండేదో తెలిపారు. అక్కడి నుంచి లేడీ సూపర్ స్టార్ ఎలా అయ్యారో, ఆమె పేరుతో సినిమాలు ఎన్నెన్ని కోట్లు మార్కెటింగ్ చేస్తాయో వంటి విషయాలను చూపించారు.
విఘ్నేశ్‌తో అలా మొదలైంది - సెకండ్ ఆఫ్ నుంచి విఘ్నేశ్ శివన్ ఫ్యామిలీ, కెరీర్‌ను కాస్త చూపిస్తూనే, నానుమ్ రౌడీ దాన్ కోసం నయన్‌తో విఘ్నేశ్ కలిసి పనిచేయడాన్ని చూపించారు. మొదటి రోజు నయనతార సెట్‌లో ఎలా ఉన్నారు? ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? దర్శకుడిగా కెరీర్‌లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న విఘ్నేశ్‌కు నయనతార ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారో విషయాలను తెలిపారు. అదే సెట్‌లో అతడిని చూసి నయనతార మనసు పారేసుకున్న తీరూను వివరించారు. ప్రస్తుతం ధనుష్, నయన్‌ల మధ్య చర్చకు కారణమైన ఆ సినిమా సెట్‌లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలను కూడా చూపించారు. నయనతార, విఘ్నేశ్ శివన్ ప్రేమించుకుంటున్నారన్న విషయం అటు ఇండస్ట్రీ, ఇటు జనాలకు తెలిసిన తర్వాత వచ్చిన మీమ్స్‌పైనా విక్కీ మాట్లాడారు.
పెళ్లికి ముందు ఏం జరిగింది? - పెళ్లికి ముందు నయనతార - విఘ్నేష్ రిలేషన్‌షిప్ ఎలా కొనసాగిందో ఇద్దరూ పంచుకున్నారు. ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? వస్తే ఏం చేస్తారు? వీరి పంచాయతీలోకి వచ్చి సర్దిచెప్పే దర్శకుడు ఎవరు? అలాగే, ఇద్దరిలో ఎవరు ఎవరికి ముందుకు తినిపించుకునేవాళ్లు వంటి ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇక పెళ్లి కోసం ఐదారు వేల మంది పనిచేయడం, గ్లాస్ హౌస్‌లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి రోజున నయనతార ధరించిన ఎరుపు రంగు డిజైనర్ దుస్తులు వెనుక కథ సహా తదితర ఆసక్తికర విషయాలను చూపించారు. వాటిని తీర్చిదిద్దడానికి డిజైనర్‌లు పడిన శ్రమనూ చక్కగా వివరించారు. చివరిలో నయన్, విఘ్నేష్‌ల పిల్లలు (nayanthara kids) ఉలగం, ఉయిరేలను చూపిస్తూ డాక్యుమెంటరీని ముగించారు.
హీరో ధనుశ్‌పై నయనతార తీవ్ర విమర్శలు - బహిరంగ లేఖ విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్
ధనుష్‌పై నయన్ భర్త విఘ్నేశ్ పోస్ట్- కాసేపటికే డిలీట్- అసలేం జరుగుతోంది?