Honor Killing In Suryapet : సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువకుడి హత్య కలకలం రేపింది. సూర్యాపేట జిల్లాకు చెందిన యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై మృతదేహాన్ని పడేశారు. ఉదయం అటు వైపుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ హత్యకు ప్రేమ వివహమే కారణమన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం : సూర్యాపేటలోని మామిల్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన కోట్ల భార్గవి అనే యువతి ప్రేమించుకున్నారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోలేదు. దీంతో ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. ప్రేమ పెళ్లి నిరాకరించిన భార్గవి తల్లిదండ్రులు వారిని విడదీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కులాంతర వివాహం చేసుకున్న బంటిపై భార్గవి సోదరుడు కక్ష పెంచుకున్నాడు. అదే కోపంతో హత్యకు పాల్పడి ఉంటారని మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు.
మహేశ్ అనే మిత్రుడి నుంచి ఫోన్ కాల్ : ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మహేశ్ అనే మిత్రుడి నుంచి బంటికి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే భార్యకు ఫోన్ ఇచ్చి ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లాడు. అదే రాత్రి హత్యకు గురయ్యాడు. హత్య చేశాక మృతదేహాన్ని, ద్విచక్ర వాహనాన్ని తీసుకువచ్చి పిల్లలమర్రి పరిధిలో పడేశారు. అమ్మాయికి సంబంధించిన వారే ఈ హత్య చేయించారనే అనుమానాలు పెరిగాయి. మృతుడి మెడకు ఉరి వేసి చంపినట్లు గుర్తులు, ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల కిందటే పెళ్లి కావడంతో మృతుడి భార్య భార్గవి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలుగా వెతుకుతున్నారు.
పరువు హత్య! - ఇంటికి వస్తే ఘనంగా పెళ్లి చేస్తామన్నారు - చంపేసి పారిపోయారు!!