TTD Trustees Board Meeting in Tirumala : తిరుమలలో కొత్తగా ఏర్పాటైన టీటీడీ నూతన పాలకమండలి తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో 80 అంశాలతో కూడిన అజెండాపై చర్చించినట్లు సమాచారం. ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం బోర్డు తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్వదర్శనం ఇక నుంచి 2 నుంచి 3 గంటల్లో పూర్తి అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని అన్నారు.
శ్రీవాణి ట్రస్టును టీటీడీ రద్దు చేస్తున్నట్లు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యాటక శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఉండే స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన అవకాశం కల్పిస్తామన్నారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు.
తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు : అలాగే ధర్మపాలక మండలి తీసుకున్న నిర్ణయాలను మరికొన్నింటిని బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేసినట్లు చెప్పారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ డబ్బులను ప్రభుత్వ బ్యాంకుల్లోకి మారుస్తామని వివరించారు. శారదా పీఠం లీజును రద్దు చేసి.. ఆ స్థలాన్ని తిరిగి తీసుకుంటామని పేర్కొన్నారు.
2025 టీటీడీ క్యాలెండర్ విడుదల : తిరుమల డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను 3 నెలల్లో తొలగిస్తామని బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి సమావేశంలోనే 2025 సంవత్సరం టీటీడీ క్యాలెండర్‌ను టీటీడీ బోర్డు ఛైర్మన్ ఆవిష్కరించారు. అన్ని అంశాలపై పాలకమండలి సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు చెప్పారు. ఇంకా ఆ నిర్ణయాలు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ - ఆ దర్శన టికెట్ల కోటా పెరిగింది
'శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలన్నదే నా ఆలోచన - భక్తులకు గంటలోనే దర్శనం'