How to Make Paneer Jalebi in Telugu : ఎక్కువ మంది ఫెవరేట్ స్వీట్ రెసిపీలలో ఒకటి జిలేబీ. అయితే, చాలా మందికి జిలేబీ అనగానే మైదా, మినప పిండితో ప్రిపేర్ చేసుకునేవి మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ, పోషకాలు పుష్కలంగా ఉండే పనీర్‌తో కూడా అద్భుతమైన జిలేబీని చేసుకోవచ్చు. అదే.. బెంగాలీ ఫేమస్ స్వీట్ రెసిపీ "పనీర్ జిలేబీ". పైగా టేస్ట్ స్వీట్ షాప్స్‌లో లభించే దానికి ఏమాత్రం తీసిపోదు! దీన్ని ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇంతకీ, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పాలు - ఒకటిన్నర లీటర్
- వెనిగర్ - పావు కప్పు
- పంచదార - 2 కప్పులు
- వాటర్ - తగినంత
- ఆరెంజ్ ఫుడ్ కలర్ - 2 చిటికెళ్లు
- యాలకుల పొడి - అరటీస్పూన్
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్లు
- మైదా - 2 టేబుల్‌స్పూన్లు
- బేకింగ్ సోడా - చిటికెడు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో సమాన పరిమాణంలో వెనిగర్, వాటర్ తీసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని పాలు పోసుకోవాలి. ఆపై హై ఫ్లేమ్ మీద జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు పాలను కలుపుతూ మరిగించుకోవాలి. ఆ తర్వాత కడాయిని దింపి పక్కన ఉంచాలి.
- తర్వాత ఆ పాలలో ముందుగా కలిపి పెట్టుకున్న వెనిగర్‌ని కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం వెనిగర్ అవసరం పడదు. అందులో సగం వరకు పోసుకుంటే సరిపోతుంది.
- ఇలా పోసినప్పుడు ఆ మిశ్రమం పాలకు పాలు, నీళ్లకు నీళ్లు మాదిరిగా విడిపోతుంది. ఐదు నిమిషాలు అలా వదిలేస్తే పాల విరుగుడు గట్టిగా పేరుకుంటుంది. పాలలోని నీరు మొత్తం విడిపోతుంది.
- అలా విడిపోయాక పాల విరుగుడు మొత్తాన్ని మస్లిన్ క్లాత్ ఉంచిన జల్లెడలోకి తీసుకోవాలి. అనంతరం వేడి పనీర్ చల్లారేదాకా, వెనిగర్ స్మెల్ పోయేంత వరకు చల్లని వాటర్ పోసి పనీర్‌ని ఆ క్లాత్‌లోనే బాగా కడగాలి.
- ఆ తర్వాత కడిగిన పనీర్‌ని గట్టిగా పిండేస్తే నీరంతా దిగిపోతుంది. అయినప్పటికీ పన్నీర్లో కొద్దిగా వాటర్ ఉండిపోతుంది. కాబట్టి ఓ 20 నిమిషాలపాటు ట్యాప్ కింద మూటగట్టి వేలాడదీస్తే అందులో మిగిలిపోయిన వాటర్ అంతా బయటకువెళ్లిపోతుంది.
- ఆలోపు రెసిపీలోకి కావాల్సిన పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని చక్కెర, వాటర్ పోసుకొని పంచదార కరిగి ఆముదంలాంటి జిగురు వచ్చేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి.
- పంచదార బాగా కరిగి అనుకున్న పాకం వచ్చాక అందులో ఆరెంజ్ ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని దింపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లో క్లాత్‌లో పొడిపొడిగా ఉన్న పనీర్‌ను తీసుకొని చేతి మణికట్టు సాయంతో ఓ నాలుగు నిమిషాలు బాగా నలుపుకోవాలి.
- అనంతరం అందులో కార్న్‌ఫ్లోర్, మైదా వేసి అవి పనీర్‌లో బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీరు, బేకింగ్ సోడా వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ముందుగా మిక్స్ చేసుకున్న పనీర్ ముద్దలో యాడ్ చేసుకొని మరికాసేపు ఆ పిండి ముద్దను బాగా కలుపుకోవాలి. అప్పుడు అది చపాతీ పిండి మాదిరిగా అవుతుంది.
- అయితే, ఇది జిలేబీ తయారీకి యూజ్ అవ్వద్దు. కాబట్టి అందులో కొన్ని వాటర్ కలుపుకొని బాగా బీట్ చేసుకొని చిక్కని గారెల పిండి మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం పైపింగ్ బ్యాగ్‌లో నాజిల్ వేసుకొని అంచులను కట్ చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఎక్కడా బుడగలు లేకుండా నింపుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని జిలేబీ వేయించడానికి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నూనె మధ్యస్థంగా హీట్ అయ్యాక పైపింగ్ బ్యాగ్ నాజిల్ వైపు కొద్దిగా కట్ చేసి కాగుతున్న నూనెలో పిండిని జిలేబీ మాదిరిగా వత్తుకోవాలి.
- డైరెక్ట్ నూనెలో వత్తుకోవడం ఇబ్బందిగా ఉంటే మురుకులు వత్తుకున్నట్లు చిల్లుల గరిటె మీద వత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు.
- ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోవాలి.
- అలా వేగిన తర్వాత వాటిని తీసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెచ్చని చక్కెర పాకంలో వేసి మొత్తం ముంచేయాలి.
- ఒక నిమిషం పాటు అలా ఉంచి ఆ తర్వాత వాటిని జల్లెడలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కమ్మని స్వీట్ షాప్ స్టైల్ "పనీర్ జిలేబీ" రెడీ!
ఇవీ చదవండి :
కోవా లేకుండానే "కమ్మటి గులాబ్ జామున్" - ఇలా చేస్తే వన్ మోర్ ప్లీజ్ అంటారు!
నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే "కొబ్బరి జున్ను" - సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా!