Reuse Kitchen Waste Efficiently : వంట చేసే క్రమంలో ఆకుకూరల కాడలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పొట్టు వంటి చాలా రకాల పదార్థాలను బయట పారేస్తుంటాం. వీటివల్ల ఏమీ ఉపయోగం ఉండదని చాలా మంది అనుకుంటారు. మీరు కూడా కిచెన్‌లో ఇలానే చేస్తున్నారా ? అయితే, ఈ కథనం మీ కోసమే! కాస్త ఓపిక చేసుకుని వీటిని వాడాలే కానీ, చాలా ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వంటింట్లో మనకు ఉపయోగపడే పదార్థాలు ఏవి ? వాటిని ఎలా వాడాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
ఆకుకూరల కాడలతో :పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలను తరచూ తింటుంటాం. వీటిని వండే క్రమంలో ఆకుల్ని వేరు చేసి.. కాడల్ని పడేయడం చేస్తుంటాం. నిజానికి ఇందులో ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని వృథాగా బయట పడేయకుండా వెజిటబుల్ స్టాక్స్, సలాడ్స్, సూప్స్‌తో పాటు టాసింగ్‌గానూ ఉపయోగించుకోవచ్చంటున్నారు.
బంగాళదుంప తొక్కలతో :ఆలుగడ్డ తొక్కలను బూట్లు పాలిష్ చేయడానికి ఉపయోగించవచ్చు. తొక్క లోపలి భాగాన్ని షూలపై రుద్దడం వల్ల మురికి పోయి క్లీన్‌గా మారతాయి. అలాగే వెండి, తుప్పు పట్టిన పాత్రలను ఈ తొక్కలతో రుద్ది కడిగితే తళతళా మెరుస్తాయి. ఆలు తొక్కలను కంపోస్ట్ ఎరువుగా కూడా వినియోగించుకోవచ్చు. ఇందులో నత్రజని, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయంటున్నారు.
యాపిల్ తొక్కలతో :యాపిల్‌ని ముక్కలుగా కట్ చేసే ముందు చాలా మంది పైన తొక్క తీసేస్తుంటారు. కానీ, ఈ తొక్కతో చాలా లాభాలున్నాయి. యాపిల్ తొక్క కళ్ల కింద నల్లటి వలయాల్ని తొలగించడంతో పాటు, కంటి అలసటను దూరం చేస్తుందట. అయితే దీనిని ఉపయోగించే ముందు కొద్దిసేపు వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత ఈ తొక్కలతో సమస్య ఉన్న చోట రుద్దుకోవాలి. అలాగే స్టీలు పాత్రలపై పడిన మరకల్ని కూడా యాపిల్ తొక్కలతో తొలగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గట్టి పడిన బ్రెడ్ :బ్రెడ్ గట్టిపడితే చాలా మందికి నచ్చదు. దాంతో వృథా అంటూ బయట పడేస్తుంటారు. నిజానికి ఈ బ్రెడ్ ముక్కల్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని బ్రెండ్ క్రంబ్స్ తయారు చేసుకోవచ్చు. వంటకాల్లో క్రిస్పీనెస్ కోసం ఈ క్రంబ్స్‌ని వాడుకోవచ్చు. అలాగే దీనివల్ల రెసిపీ టేస్ట్ కూడా పెరుగుతుందని వివరిస్తున్నారు.
ఇవి కూడా ఉపయోగమే!
- మనలో చాలామంది ఉల్లి, వెల్లుల్లి పొట్టుని పడేస్తుంటారు. అయితే వీటిని సూప్స్, స్టాక్స్‌లో భాగం చేసుకోవచ్చు. దీనివల్ల అందులోని పోషక విలువలు వృథాగా పోవు. అలాగే ఆయా పదార్థాల టేస్ట్ మరింత పెరుగుతుంది.
- విరిగిన పాలను పడేయకుండా వాటితో వెండి నగల్ని క్లీన్ చేసుకోవచ్చు.
- అలాగే బటర్‌ని ఉపయోగించుకున్నాక ఆ ప్యాకెట్స్/షీట్స్‌ని పడేస్తుంటారు ఎక్కువ మంది. నిజానికి ఆ షీట్ లోపలి వైపు అంటుకున్న బటర్‌ని బేకింగ్ ట్రే గ్రీజులా యూజ్ చేసుకోవచ్చు.
- పుచ్చకాయ, తర్బూజా.. వంటి తొక్కల్ని పడేయడం చాలా మంది చేస్తుంటారు. అయితే వాటితో మురబ్బా, జామ్.. వంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్‌లో తెప్పించుకున్న కూరగాయలు, పండ్లు మెష్ బ్యాగ్స్‌లో ప్యాక్ చేసి వస్తుంటాయి. అయితే ఆయా పదార్థాల్ని వాడుకొని బ్యాగ్స్‌ని వృథాగా పడేస్తుంటారు. నిజానికి ఇవే బ్యాగ్స్‌లో కాయగూరలు, పండ్లని ఉంచి ఫ్రిడ్జ్‌లో భద్రపరచుకోవచ్చు. తద్వారా వీటికి ఉండే రంధ్రాల ద్వారా గాలి తగిలి అవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ బ్యాగ్స్ మరీ పాడైపోతే.. వాటిని గిన్నెలు తోమే స్క్రబ్బర్స్‌గానూ వాడుకోవచ్చంటున్నారు.
- పేపర్ టవల్‌ని వాడుకున్నాక మిగిలిన రోల్స్‌ని పడేయకుండా.. వాటిని కేబుల్/వైర్ ఆర్గనైజర్‌గా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల అవి చిక్కులు పడకుండా, బయటికి కనిపించకుండా ఉంటుందని అంటున్నారు.
బంగాళదుంప తొక్కను ఇలా కూడా వాడొచ్చా? - తెలిస్తే షాక్ అవుతారు!
మీ వంటింట్లో ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారా? - ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో కొత్తవాటిలా మెరుస్తాయి!