Psychologist Advice for Brother in law Behavior: బావ, మరదలు మధ్య బంధం చాలా స్పెషల్. వాళ్లిద్దరి మధ్య సరదా సన్నివేశాలు, ఆట పాటలు, గిల్లికజ్జాలు, ఆటపట్టించే ప్రేమ, గౌరవం ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక లిమిట్ వరకు ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. హద్దు దాటితేనే సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యనే ఓ యువతి ఎదుర్కొనగా, దానికి పరిష్కారం చెప్పమని నిపుణుల సలహా కోరుతోంది. ఇంతకీ ఆ యువతి సమస్య ఏంటి? నిపుణులు సమాధానం ఏం ఇచ్చారో ఈ స్టోరీలో చూద్దాం.
సమస్య ఇదే: "మా అక్కకు కొన్ని నెలల కిందట పెళ్లి జరిగింది. మా బావ ప్రైవేటు ఎంప్లాయ్. నా వాట్సాప్ స్టేటస్‌లకు లైక్‌లు కొడుతుంటాడు. కామెంట్లూ పెడతాడు. నేనూ ఆయన స్టేటస్‌లకు స్పందిస్తుంటా. ఇన్‌స్టాలోనూ అప్పుడప్పుడు ఇద్దరం చాట్ చేసుకుంటున్నాం. అయితే ఈ మధ్య మా బావ తీరు కాస్త హద్దులు దాటుతున్నట్టు అనిపిస్తోంది. "మీ అక్కను కాకుండా నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే బాగుండు, మీ అక్క ఒట్టి మొద్దు, తనకు భర్తను ఎలా ప్రేమించాలో తెలియదు" ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నాడు. మొదట్లో ఇలాంటివి నచ్చక చాటింగ్ ఆపేద్దాం అనుకున్నా. కానీ రానురాను ఎందుకో బావతో చాట్ చేయకుండా ఉండలేకపోతున్నా. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. పైగా అక్కకు అన్యాయం చేస్తున్నాననే అపరాధ భావమూ వెంటాడుతోంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి?" అని ఓ యువతి కోరగా, దీనికి నిపుణుల సమాధానం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం.
వయసులో ఉన్నప్పుడు అపోజిట్ సెక్స్ వ్యక్తుల పట్ల ఆకర్షణ కలగడం సహజం. అది బంధువులైనా కావచ్చు. కానీ ఆ చేతలు ఎంతవరకు వెళ్తున్నాయో గ్రహించుకోవడం మంచిదని క్లినికల్ సైకాలజిస్ట్ పీసపాటి శైలజ చెబుతున్నారు. మీరు మీ అక్క భర్తతో ఎందుకు చాటింగ్ చేస్తున్నారో ఒక్కసారి ప్రశ్నించుకోమని, ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి ఇబ్బందో ఆలోచిస్తే సమాధానం వెంటనే దొరుకుతుందని చెబుతున్నారు. ముందు ప్రైవేట్ చాటింగ్ ఆపి, తను(అక్క భర్త) మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం చేయాలని అంటున్నారు. ఎందుకంటే ఈ అలవాటు మీ అక్కకు, ఆమె సంసారానికి, మీ అనుబంధానికి, ఇంకా ముందుకెళ్తే మీకూ ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.