NRI Rohan Cherla :తల్లి చెప్పిన ఒక్క మాట ఈ కుర్రాడి ఆలోచన విధానాన్నే మార్చేసింది. అప్పటి వరకు సరదాగా తిరిగిన ఈ కుర్రాడు సామాజిక బాధ్యత భుజాన వేసుకున్నాడు. చదువుకోవాలని ఉన్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. అతడే రోహన్ జగన్నాథ భాస్కర్ చెర్ల.
రోహన్ జగన్నాథ భాస్కర్ చెర్ల తల్లితండ్రులు కిరణ్, హిరణ్మయి కెనడాలో స్థిరపడ్డారు. తనూ అక్కడే పుట్టి పెరిగాడు. రోహన్ తాత విశాఖ ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు. ఒకసారి తన తాత చదువు చెప్పిన కళాశాల చూడటానికి వచ్చినప్పుడు విద్యార్థులు చాలాచోట్ల కార్మికులుగా చేయడాన్ని చూసి చలించిపోయాడు రోహన్.
చదువుకోవాల్సిన సమయంలో కార్మికులుగా విద్యార్థులు పని చేయడం ఏంటమ్మా అని తల్లిని అడిగాడు రోహన్. చదువుకోవడానికి ఆర్థికస్థోమత లేక అలా ఉండిపోయారన్న ఆమె సమాధానంతో రోహన్ మనసులో ఆలోచన మెుదలైంది. తన చుట్టూ ఉన్న వాళ్లు తనలాగే చదువుకోవాలని ఆర్థికంగా సహకరించేందుకు సిద్ధమయ్యాడు. కెనడా మిత్రుడు జోసెఫ్ సహకారం తోడవ్వడంతో JB ఫౌండేషన్ నెలకొల్పాడు రోహన్.
గతేడాది విశాఖ ఏవీఎన్ కళాశాల అధికారులతో మాట్లాడి జేబీ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాడు రోహన్. 37 మందికి 10 వేల నుంచి 20 వేల వరకు కళాశాల ఫీజు ఉపకారవేతనంగా ఇచ్చాడు. ఈ ఏడాది ఆ సంఖ్య 50 మందికి పెంచి సుమారు 6 లక్షల రూపాయల వరకు ఉపకారవేతనంగా అందించాడు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను 200 మందికి పెంచాలని నిర్ణయం తీసుకున్నాడు.