Surprising Home Uses for Sugar: టీ, కాఫీ, స్వీట్స్ ఇలా ఏ పదార్థామైనా రుచిగా ఉండాలంటే అందులో సరిపడా పంచదార ఉండాల్సిందే! నిత్యం మనం కూరల్లో ఉప్పు ఎలా వినియోగిస్తామో, చక్కెర కూడా అలానే వాడుతుంటాం. ఇవి రెండూ లేకపోతే మనం తినే ఆహార పదార్థాలు అంత రుచిగా ఉండవు! అయితే, షుగర్‌ని స్వీట్లు, టీ, కాఫీల వంటి వాటి రుచి పెంచడమే కాకుండా, నిత్య జీవితంలో వివిధ పనుల కోసం వాడచ్చంటున్నారు నిపుణులు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి వస్తువులు ఇక తళతళా! కొన్ని కారణాల వల్ల వెండి వస్తువులు క్రమంగా మెరుపును కోల్పోతాయి. ఇలాంటి వాటిని కొత్తవాటిలా మెరిపించడానికి షుగర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల చక్కెర తీసుకొని అందులో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి పంచదార కరిగేంత వరకు బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వెండి వస్తువులపై పూసి కొన్ని నిమిషాల తర్వాత కడగాలి. అంతే అవి కొత్తవాటిలా తళతళలాడతాయి.
మరకలు మాయం! కొన్నిసార్లు అనుకోకుండా చేతులకు గ్రీజు అంటుకున్నప్పుడు ఎంత కడిగినా ఆ మురికి వదలదు. అలాంటప్పుడు లిక్విడ్ హ్యాండ్‌వాష్‌లో కొద్దిగా పంచదార వేసి ఆ మిశ్రమంతో చేతుల్ని శుభ్రం చేసుకుంటే గ్రీజు మరకలు పోతాయి. ఇక మనం గార్డెన్‌లో పని చేస్తున్నప్పుడు బట్టలకు మట్టి అంటుకోవడం సహజం. దీన్ని ఈజీగా వదిలించుకోవాలంటే గోరువెచ్చటి నీటిలో కాస్త షుగర్ వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. దీన్ని మరక ఉన్న చోట అప్లై చేసి గంట పాటు పక్కన పెట్టాలి. అనంతరం శుభ్రం చేస్తే సరిపోతుంది.
ఫ్లోర్‌పై మరకలు మాయం చేయండిలా! టైల్స్‌పై ఏదైనా మరక పడితే అంత ఈజీగా వదలదు. అలాంటప్పుడు ఆ మరకను షుగర్‌తో శుభ్రపరిస్తే సరి. ఇందుకోసం ఒక గిన్నెలో 4 టేబుల్‌స్పూన్ల వెనిగర్, కొద్దిగా పంచదార తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి, మరక ఉన్న చోట రుద్దితే ఇట్టే మాయమైపోతుంది.
తుప్పు వదిలిద్దాం! సామాన్లకు పట్టిన తుప్పును వదలగొట్టే శక్తి పంచదారకు ఉంది. ఇందుకోసం ఒక నిమ్మచెక్క రసాన్ని తీసుకొని అందులో మూడు టేబుల్‌స్పూన్ల షుగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తుప్పు పట్టిన వస్తువులపై వేసి కడిగితే అవి ఈజీగా శుభ్రపడతాయి.
బ్యాడ్‌స్మెల్ దూరం! కాఫీ గ్రైండర్స్, మిక్సీ జార్లు, ఇతర డబ్బాలు వంటివన్నీ ఎక్కువ రోజులు వాడకుండా మూతపెట్టి అలాగే ఉంచడం వల్ల కొన్ని రోజులకు వాటి నుంచి అదో రకమైన దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు ఆ బ్యాడ్స్మెల్ని దూరం చేయడానికి చక్కెర బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కాఫీ గ్రైండర్స్, మిక్సీ జార్ల వంటి వాటిలో పావు కప్పు పంచదార వేసి కొద్దిసేపు గ్రైండ్ చేయాలి. అనంతరం కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల అందులోని వాసనను షుగర్ పీల్చేసుకుంటుంది. ఇక ఇతర బాక్సుల్లో ఒక టీస్పూన్ పంచదారను వాటిలో వేసి మూత పెట్టాలి. తిరిగి ఆ డబ్బాలను ఉపయోగించుకునే ముందు శుభ్రంగా కడిగితే చక్కటి ఫలితం ఉంటుంది.
మరికొన్ని చిట్కాలు!
- 3 టేబుల్ స్పూన్ల చక్కెరకు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కలిపి కొన్ని వాటర్ పోసి చిక్కగా చేసుకోవాలి. ఈ మిశ్రమంతో పాత్రలను క్లీన్ చేస్తే అవి తళతళా మెరిసిపోతాయి.
- ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత చేతులు ఓ రకమైన వాసన వస్తుంటాయి. ఈ వాసన పోవాలంటే టేబుల్‌స్పూన్ చక్కెరకు టీస్పూన్ లిక్విడ్ హ్యాండ్‌వాష్ కలిపి ఆ మిశ్రమంతో చేతుల్ని రుద్దుకోవాలి. ఆపై శుభ్రం చేసుకుంటే సరి.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి - రెండు ఖండాలు, 14దేశాల మీదుగా ప్రయాణం
మీ పట్టీలు నల్లగా మారాయా? - సింపుల్‌గా కొత్తవాటిలా మార్చుకోండి