Report on AP Ministers Performance : పనితీరు నివేదికలు ఇంకా ఇవ్వని మంత్రులకు సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఏడు నెలలుగా అమాత్యులు పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు, శాఖాపరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలపై నివేదికలు కోరింది. నిర్ణయాల అమలు, పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు, తదితర సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ఇవ్వాలని ఆదేశించింది.
ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్లు విడివిడిగా సమాచారం ఇవ్వాలని సీఎంఓ సూచించింది. కొందరు మంత్రులు మాత్రమే నివేదికలు ఇవ్వడంపై ఇటీవల మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. నివేదికలు ఇవ్వని మంత్రులకు సీఎంఓ మరోసారి ఆదేశాలు జారీచేసింది.
ఇటీవలే సీఎం చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రులుగా, ప్రభుత్వపరంగా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. ఆరు నెలల పనితీరుపై ముగ్గురు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని వివరించారు. నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌లు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ అందజేశారని వెల్లడించారు. అమాత్యుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు.
'ఫొటోలకు ఫోజులు కాదు - ఫలితాలు కావాలి' - మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు క్లాస్