NARA LOKESH MEET RAILWAY MINISTER: దిల్లీలో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. రైల్వేబడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌తో సుమారు 2 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఏపీలో తీసుకొచ్చిన నూతన పాలసీలను మంత్రి లోకేశ్ వివరించారు.
ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్న లోకేశ్, ఏఐ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని అన్నారు. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఏఐ విప్లవంతో డేటా సిటీల ఏర్పాటుకు భారీ డిమాండ్ రాబోతుందన్న లోకేశ్, ఏపీలో ఎలక్ట్రానిక్ కంపెనీల ఏర్పాటుకు సహకరించాలన్నారు.
సానుకూలంగా స్పందించిన అశ్వినీవైష్ణవ్: డేటా సిటీలు, ఎలక్ట్రానిక్ కంపెనీల ద్వారా భారీగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో ఉన్నామన్న మంత్రి లోకేశ్, మంగళగిరిలో రైల్వేభూముల్లో పేదలు నివసిస్తున్నారని తెలిపారు. మానవతాదృక్పథంతో రైల్వేభూములు రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రైల్వేభూములను ఏపీకి కేటాయిస్తే పేదలకు పట్టాలు ఇస్తామని చెప్పారు. మంత్రి లోకేశ్ అభ్యర్థనల పట్ల అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. బుధవారం కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామిని సైతం లోకేశ్ కలవనున్నారు.
సమష్టి కృషితోనే రాష్ట్రానికి మేలు: లోకేశ్ వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్రమంత్రులు, ఎంపీలను లోకేశ్ అభినందించారు. సమష్టి కృషితోనే రాష్ట్రానికి మేలని, కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్‌ను కాపాడుకోగలిగామని కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలతో మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇకముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దామని చెప్పారు. దిల్లీలో కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలతో లోకేశ్ మాట్లాడారు.
దిల్లీ పర్యటనకు వచ్చిన లోకేశ్‌ను కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సమష్టి కృషితో విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్‌కు నిధులు తెచ్చుకోగలిగామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని అభినందించారు. అతి తక్కువ కాలంలో విశాఖ స్టీల్‌తో సహా అనేక సమస్యలు పరిష్కారం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మంత్రులు, ఎంపీలతో లోకేశ్ చెప్పారు.
ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు - మరిన్ని నమోభారత్, వందేభారత్ రైళ్లు: అశ్విని వైష్ణవ్