Thyroid Symptoms in Telugu: థైరాయిడ్ జబ్బు లక్షణాలు అనగానే బరువు తగ్గటం, చెమట ఎక్కువగా పట్టటం, వేడి ఆవిర్లు, గుండె వేగంగా కొట్టుకోవటం లాంటివే గుర్తుకొస్తాయి. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయటం వల్ల హైపర్‌థైరాయిడిజమ్.. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి నెమ్మదిగా పనిచేస్తే హైపోథైరాయిడిజమ్ తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చలి, బరువు పెరగటం, గుండె వేగం తగ్గటం వంటివి కనిపిస్తుంటాయని వివరిస్తున్నారు. అయితే, ఇంత స్పష్టమైనవి కాకపోయినా కొన్ని ఇతరత్రా లక్షణాలు కూడా థైరాయిడ్ జబ్బుతో ముడిపడి ఉంటాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏకాగ్రత కుదరకపోవటం: థైరాయిడ్ గ్రంథి మెదడుకు కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లను పంపిస్తుంటుందని నిపుణులు అంటున్నారు. ఇవి మెదడు పనితీరులో పాలు పంచుకుంటాయని చెబుతున్నారు. హైపోథైరాయిడిజమ్‌లో ఇలాంటి హార్మోన్ల ప్రవాహం మందగించి.. ఏకాగ్రత తగ్గటం, మతిమరుపు, సరిగా ఆలోచించలేకపోవటం వంటివి తలెత్తుతాయని వివరిస్తున్నారు. 2019లో European Thyroid Journalలో ప్రచురితమైన "The Prevalence of Thyroid Symptoms in the General Population" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మూడ్ మారటం: బాధ, నిరాశ, నిస్పృహ, విచారం వంటివీ థైరాయిడ్ సమస్య లక్షణాలు కావొచ్చని చెబుతున్నారు. నిజానికి చాలామందిలో థైరాయిడ్ సమస్య కుంగుబాటుతోనే బయటపడుతుందని.. ఆందోళన కూడా కలగొచ్చని అంటున్నారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజమ్‌లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు.
ముఖం ఉబ్బు: ముఖం వాచినట్టుగా, ఉబ్బరించినట్టుగా అనిపిస్తే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదేమోననీ అనుమానించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీని పనితీరు మందగిస్తే శరీరంలోని ద్రవాలు సరిగా బయటకు వెళ్లవని వివరిస్తున్నారు. అప్పుడు కనురెప్పలు, పెదవులు, నాలుక ఉబ్బినట్టు కనిపిస్తాయని అంటున్నారు.
చూపు మసక: కొందరిలో థైరాయిడ్ జబ్బు కారణంగా కంటి చుట్టూరా కణజాలంలో నీరు ఎక్కువగా చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా కంటిని నియంత్రించే కండరాలు పెద్దగా అవుతాయని అంటున్నారు. దీంతో చూపును సరిగా కేంద్రీకరించలేక.. చూపు మసకబారొచ్చని వివరిస్తున్నారు.
రుచి మార్పు: మనకు వంటకాల రుచి తెలియటానికి నాలుకతో పాటు మెదడు కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ గ్రంథి మందగిస్తే వీటి పనితీరూ అస్తవ్యస్తమవుతుందని వివరిస్తున్నారు. ఫలితంగా ఆయా వంటకాల రుచీ మారిపోతుందని అంటున్నారు.
శృంగారాసక్తి తగ్గటం: థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే జీవక్రియలు నెమ్మదిస్తాయని చెబుతున్నారు. ఇది సెక్స్ హార్మోన్లను విడుదల చేసే అవయవాల మీదా విపరీత ప్రభావం చూపొచ్చని అంటున్నారు. ఫలితంగా శృంగారం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుందని వివరిస్తున్నారు.
విసర్జన సమస్యలు: థైరాయిడ్ మందగిస్తే జీర్ణక్రియ, పేగుల కదలికలు సైతం నెమ్మదిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఇది మలబద్ధకానికి దారితీయొచ్చని వెల్లడిస్తున్నారు. ఒకవేళ థైరాయిడ్ మరీ చురుకుగా పనిచేస్తే నీళ్ల విరేచనాలు పట్టుకోవచ్చని.. తరచూ విరేచనం కావొచ్చని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మందులు వేయకుండానే విటమిన్ D - ఇది లోపిస్తే ఎన్నో సమస్యలు వస్తాయట జాగ్రత్త!
టైప్ 2 డయాబెటిస్తో భయం ఎందుకు? సింపుల్ టిప్స్‌తో షుగర్ కంట్రోల్ చేయండిలా!