Rice Uses Other Than Food: బియ్యంతో అన్నం లేదా దోశ, పిండి లాంటి ఇతర వంటకాల తయారీలో వాడుతుంటారు. కానీ బియ్యాన్ని కేవలం ఇలా వంటలకే కాకుండా.. ఇతర అనేక ఇంటి అవసరాల్లో భాగంగా కూడా వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బియ్యాన్ని ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
- మొబైల్ ఫోన్, రిమోట్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అప్పుడప్పుడూ పొరపాటున నీళ్లలో పడిపోవడం లేదంటే తడుస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వీటిని కొద్దిగా బియ్యం నింపిన డబ్బాలో బియ్యంతో కప్పి రెండు గంటల పాటు ఉంచాలని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల వాటిలోని తేమను బియ్యం పీల్చుకుంటుందని వివరిస్తున్నారు.
- మన వంటింట్లోని కప్‌బోర్డులు, రిఫ్రిజిరేటర్ల నుంచి అప్పుడప్పుడూ దుర్వాసనలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు బియ్యం నింపిన ఓ గిన్నెను ఆయా అల్మరాలు, ఫ్రిజ్‌లో ఓ మూలన పెడితే ఆ వాసనను బియ్యం పీల్చేసుకుంటుందని వివరిస్తున్నారు.
- ఇంకా డబ్బాలో నిల్వ ఉంచిన ఉప్పుకి తడి తగిలితే అది గట్టి పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే అందులో కొన్ని బియ్యపు గింజలు వేస్తే సరిపోతుందని అంటున్నారు.
- మామిడి, సీతాఫలం వంటి పండ్లను త్వరగా పక్వానికి తీసుకురావడానికి కొన్ని రకాల రసాయనాలను వాడి మాగబెడుతుంటారు. అలాకాకుండా వాటిని బియ్యంలో కప్పి ఉంచితే సహజంగానే అవి త్వరగా పండుతాయని చెబుతున్నారు.
- ఇంకా బియ్యం కడిగిన నీళ్లు, అన్నాన్ని ఉడికించేటప్పుడు వేరు చేసిన గంజిలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ నీటిని ముఖం, జుట్టు, పాదాలు, గోళ్ల సంరక్షణకు వివిధ పద్ధతుల్లో ఉపయోగించచ్చని వివరిస్తున్నారు.
- బియ్యం కడిగిన నీళ్లను కాయగూరలు, పండ్లను శుభ్రం చేసుకోవడానికి వాడుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకోసం ఆ నీళ్లలో కాయగూరలు, పండ్లను పావుగంట పాటు ఉంచి ఆ తర్వాత సాధారణ నీటితో మరోసారి శుభ్రం చేస్తే సరిపోతుందని అంటున్నారు.
- బియ్యాన్ని ఉడికించిన నీటి (గంజి)లో ప్రొటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ నీటిలో కాస్త ఉప్పు వేసుకొని తాగితే అందులోని పోషకాలు శరీరానికి అంది సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వివరిస్తున్నారు.
- గంజిని మొక్కలకు ఎరువుగా కూడా వాడచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పోషకాలు.. మొక్కల్ని చీడపీడల నుంచి రక్షిస్తాయని వివరిస్తున్నారు.
- తేమ వల్ల కత్తులు, కత్తెర వంటి కొన్ని ఇనుప వస్తువులు తుప్పు పడుతుంటాయి. ఇలాంటి వాటిని బియ్యం నిల్వ ఉంచే డబ్బాలో ఉంచితే ఈ సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు.
- ఇంకా తేమ ప్రభావం వెండి ఆభరణాల పైనా ఉంటుందని.. ఫలితంగా అవి కళ తప్పినట్లుగా కనిపిస్తాయని అంటున్నారు. అలాంటప్పుడు ఒక మెష్ బ్యాగ్‌లో బియ్యాన్ని నింపి.. వీటిని భద్రపరిచే బాక్సులో ఉంచితే ఆ తేమను బియ్యం పీల్చేసుకుంటుందని చెబుతున్నారు. అలాగే నిర్ణీత వ్యవధుల్లో ఈ బియ్యాన్ని మార్చడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.
- వీటితో పాటు బియ్యపు గింజల్ని పేర్చుతూ వివిధ రకాల అలంకరణ వస్తువులు తయారుచేయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఓపిక ఉంటే మీరూ ఇలాంటివి సిద్ధం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక ఈ గింజలకు రంగులు అద్దితే మరింత ఆకర్షణీయమైన డెకరేటివ్ పీసెస్ సిద్ధమవుతాయని వివరిస్తున్నారు. వీటికి సంబంధించి యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు చూడచ్చని.. లేదంటే మీలోని సృజనకు పదును పెట్టచ్చని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లలు పాలు తాగట్లేదా? ఇలా చేస్తే గ్లాసు మొత్తం ఖాళీ చేసేస్తారట!
మీ జుట్టు తత్వాన్ని బట్టే తలస్నానం చేయాలట- ఆ షాంపూలు వాడొద్దని నిపుణుల సలహా!