Pratidhwani Debate On Budget 2025 : కొత్తపద్దుకు సమయం దగ్గర పడింది. భారీ అంచనాల మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. సంప్రదాయంగా ఏటా అందుకు ముందు వచ్చే ఆర్థిక సర్వే.. ఈసారి దేశ స్థితిగతులు ఎలా ఉన్నాయంటోంది? వృద్ధిరేటు, అవకాశాలు, వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై 2024-25 ఆర్థిక సర్వే ఏం చెప్పింది?
బడ్జెట్‌లో పేద, మధ్యతరగతితో పాటు మహిళలకు పెద్దపీట వేస్తారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు రానున్న వరాలజల్లుకు సంకేతమా? కేంద్ర బడ్జెట్ మురిపిస్తుందా సంస్కరణబాటలో సామాన్యులకు దూరంగా సాగిపోతుందా? కోట్లాది మంది మదిలో మెదులుతున్న ఇవే ప్రశ్నలపై ఆర్థిక, వాణిజ్య, పన్నుల రంగంలో నిష్టాణుతులైన ఇద్దరు గెస్ట్‌లు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
బడ్జెట్‌పై గంపెడు ఆశలు : వికసిత భారత్ లక్ష్యంగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.పేదరిక నిర్మూలన, ఆహార, సామాజిక భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయపన్ను రేట్లు, స్లాబ్‌లో మార్పులు చేస్తారనే సంకేతాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెన్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనతను సాధించనున్నారు.
జీఎస్టీ మినహాయింపు : పెద్ద పెద్ద నగరాల్లో జీఎస్టీ వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా రూ.50 లక్షలకు ఒక ఫ్లాట్ కొనుగోలు చేస్తే దాదాపు రూ.9 లక్షల వరకు జీఎస్టీ కట్టాల్సి వస్తోంది. అందుకే జీఎస్టీని మినహాయిస్తే వారికి పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.
స్థిరాస్తి రంగానికి ఊరట లభించేనా : ఈ ఏడాది ప్రవేశపెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్‌పై గృహ నిర్మాణ రంగం, పట్టణ రంగానికి చెందిన వారు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ రంగం పుంజుకుంటే లక్షలాది మందికి ఉపాధి లభించడం సహా వ్యవస్థలోకి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది. హౌసింగ్ రంగానికి పన్ను మినహాయింపుతో పాటు, రియల్ ఎస్టేట్‌ను పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ల నెలకొన్న వేళ ఈ ఏడాది పద్దుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.