Vasanth Panchami Remedies for Children: ఏటా మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని "వసంత పంచమి"గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పండగనే బసంత్ పంచమి, సరస్వతీ పంచమి, మదన పంచమి, శ్రీపంచమి అనే పేర్లతో పిలుస్తారు. అందులోనూ పంచమి రోజే సరస్వతీ జయంతి కావడంతో ఈ పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజున చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. మరి, మీ పిల్లలు కూడా చదువులో రాణించి ఉన్నత స్థానంలో నిలబడాలంటే ఫిబ్రవరి 2 వసంత పంచమి రోజు ఈ నీళ్లు తాగించాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్‌కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొద్దిమంది పిల్లలు ఇంట్లో ఎంత బాగా చదివినా పరీక్షల దగ్గరకు వచ్చేసరికి వెనకబడుతుంటారు. ఆ సమయానికి చదివినది ఏదీ గుర్తురాదు. అలాంటి వారందరికి ఈ వసంత పంచమి రోజు ఓ శక్తివంతమైన పరిహారం పాటిస్తే మంచి జరుగుతుందని మాచిరాజు చెబుతున్నారు. అలాగే చదువుపై ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి, పరీక్షల్లో బాగా మార్కులు రావడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ కోసం ఈ పరిహారం ఉపయోగపడుతుందని అంటున్నారు. ఆ పరిహారం ఎలా చేయాలంటే,
- ఈ పరిహారాన్ని ఇంట్లో తల్లి లేదా తండ్రి నిర్వహించాలి.
- ఓ గ్లాసులో నీరు తీసుకోవాలి.
- ఆ గ్లాసును ఎడమచేతితో పట్టుకుని దాని మీద కుడి అరచేతిని ఉంచాలి.
- గ్లాసు పై భాగంలో అరచేతిని ఉంచిన తర్వాత "ఓం ఐం వాన్యై స్వాహా" అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఇలా మంత్రం చదవడం వల్ల దాని శక్తి నీటిలోకి చేరుతుంది.
- అప్పుడు ఆ నీటిని పిల్లల చేత తాగించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలపై సంవత్సరం మొత్తం సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు.
వసంత పంచమి పూజా విధానం:
- ముందుగా ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రపరచుకుని అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో దేవుడి విగ్రహాల వద్ద ఓ పీటను ఏర్పాటు చేయాలి.
- పీటకు పసుపు రాసి బియ్యప్పిండితో స్వస్తిక్ గుర్తు, అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు ఒక్కటీ వేసుకున్నా సరిపోతుంది.
- ఆ పీటపై తెల్లని వస్త్రాన్ని ఉంచి దాని మీద సరస్వతీ దేవి ఫొటోను ఉంచాలి. ఆపై చిత్రపటానికి కుంకుమ, గంధం బొట్లు అలంకరించాలి.
- సరస్వతీ దేవికి తొమ్మిది వత్తుల దీపం అంటే చాలా ఇష్టం. కాబట్టి, వసంత పంచమి రోజు అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది వత్తులను విడివిడిగా వేసుకొని దీపం వెలిగించాలి.
- ఆ తర్వాత అమ్మవారిని తెల్లని(మల్లె, జాజి, నందివర్దనం) పుష్పాలతో పూజించాలి. అలా పూలతో పూజ చేస్తున్న సమయంలో "ఓం ఐం సరస్వత్యై నమః" అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో చదువుకుంటూ ఉండాలి.
- అనంతరం సరస్వతీ దేవికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం, తెల్లటి బెల్లం, కొబ్బరి ముక్కలు, పేలాలు, చెరకు ముక్కలు వంటి ఏవైనా తెల్లని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.
పంచమి రోజు చదవాల్సిన స్తోత్రాలు: శ్రీ పంచమి రోజు సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం చదివినా, విన్నా సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే సరస్వతీ కవచం వింటే ప్రపంచాన్ని జయించే తెలివితేటలు లభిస్తాయని చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
"ఏ పని చేసినా కలిసి రావట్లేదా? - హనుమంతుడి ఆలయానికి వెళ్లండి"
"భరించలేని అప్పుల బాధలా? - ఈ ఉంగరం ధరిస్తే అన్నీ తీరిపోతాయి"