Padmavyooham full story : మహాభారత యుద్ధంలో కౌరవులు పన్నిన "పద్మవ్యూహం" గురించి అందరికీ తెలుసు. తరచూ ఎవరో ఒకరు, ఏదో ఒకచోట ఈ పదాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. ఈ వ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది అత్యంత భయంకరమైన వ్యూహం. ఇక్కడి వరకు అందరికీ తెలుసు. కానీ, అసలు ఆ వ్యూహం ఎలా ఉంటుంది? ఆకారం, సైజు ఏంటి? ఎందుకు దాన్ని ఎవరూ ఛేదించలేరు? ఛేదించగలగిన వారు ఎవరైనా ఉన్నారా? పాండవుల పక్షాన అభిమన్యుడే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు బయటికి రాలేకపోయాడు? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
పద్మవ్యూహం ఎలా ఉంటుంది? :
పద్మవ్యూహం "తామర పువ్వు" ఆకారంలో ఉంటుంది. వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్నే "చక్రవ్యూహం" అని కూడా అంటారు. మొత్తం ఏడు వలయాలు ఉంటాయి. పైనున్న చిత్రాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. వీటిల్లో రథ దళాలు, గజ (ఏనుగు) దళాలు, తురగ (గుర్రం) దళాలు, కాల్బలం (కాలి బాటన నడిచే) సైనికులు వలయంగా నిలబడి ఉంటారు. ఇందులోకి వెళ్లిన వారు మరణించడం తప్ప, గెలిచి తిరిగి రావడం అన్నదే ఉండదు.
ఎవరు నిర్మించారు? :
కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితుడైన ద్రోణాచార్యుడు, యుద్ధంలో పాండవులను సరిగా ఎదుర్కోలేకపోతూ ఉంటాడు. దీంతో దుర్యోధనుడు ద్రోణుడి వీరత్వాన్ని హేళన చేస్తాడు. ఇంకా ధర్మరాజును బంధించలేకపోయారు అంటూ ఎగతాళి చేస్తాడు. అవమానంగా భావించిన ద్రోణుడు, "ఈరోజు దేవతలు కూడా ఛేదించలేని గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను. మహావీరుడైతే తప్ప ప్రయత్నం కూడా చేయలేరు" అని ప్రకటించాడు. అలా పద్మవ్యూహాన్ని నిర్మించాడు.
ఇలా నిలబెట్టాడు :
తామరపువ్వు ఆకారంలో కౌరవ సేనలను నిలబెట్టాడు ద్రోణుడు. పలు దేశాధిపతులను పువ్వులోని రేకుల తీరుగా నిలబెట్టాడు. వారి కుమారులను పువ్వు మధ్యభాగంలోని కేసరిలా ఉంచాడు. కర్ణ, దుశ్శాసనులు తమ సేనలతో పువ్వు లోపలి భాగంలో ఉన్నారు. వారిద్దరి సైన్యాల మధ్య దుర్యోధనుడు తన సైన్యంతో నిలిచాడు. ఇంకా అశ్వత్థామ, సైంధవుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, శలుడు, భూరిశ్రవుడు, శల్యుడు, వారి కుమారులూ తమ తమ స్థానాల్లో నిలిచారు.
లోపలికి వెళ్లగలిగే వీరులు వారే :
పద్మవ్యూహాన్ని ఛేదింగచగలవారు నలుగురు మాత్రమే. అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, దాన్ని రూపొందించిన ద్రోణుడు. అభిమన్యుడు లోనికి మాత్రం వెళ్లగలడు.
అర్జునుడు లేకపోవడంతో :
పాండవ మహా వీరుల్లో ఎవరికీ పద్మవ్యూహంలోకి ప్రవేశించటం సాధ్యం కాలేదు. ఈ పథకానికి ముందుగానే సంశప్తకులు అర్జునుడిని వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంవైపునకు తీసుకెళ్లారు. దీంతో ధర్మరాజుకు దిక్కుతోచలేదు. అప్పుడు అభిమన్యుడిని పంపక తప్పలేదు. "కుమారా! నువ్వు పద్మవ్యూహంలోకి దారి చూపుతూ ప్రవేశించు. నీ వెంటనే మేమందరం లోపలికి వచ్చేస్తాం" అని ధర్మరాజు అన్నాడు. సమరోత్సాహంతో "అలాగే తండ్రీ" అంటూ అభిమన్యుడు సిద్ధమయ్యాడు. అప్పుడు అభిమన్యుణి రథసారథి సుమిత్రుడు ఇలా హెచ్చరిస్తాడు. "నువ్వు బాలుడివి. నీ ఎదుట ఉన్నది అతిరథ మహారథులతో నిండిన ద్రోణుని సైన్యం. నీ చేతిలో మరణించేవాళ్లు కాదు. మరోసారి ఆలోచించు" అని అన్నాడు. నేనేంటో చూపిస్తాను పదా అంటూ మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి దూసుకెళ్లాడు అభిమన్యుడు.
అభిమన్యుడి వీరవిహారం :
అభిమన్యుడి ధాటికి కౌరవ సేన కకావికలమైంది. పద్మవ్యూహం మొత్తం చెల్లా చెదురైంది. దొరికిన వారిని దొరికినట్టు కత్తికో కండగా నరుకుతున్నాడు. మహావీరుడైన కర్ణుడి కవచాన్ని కూడా పగలగొట్టాడు. బాణాలతో మూర్ఛిల్లేలా చేశాడు. అభిమన్యుడి దెబ్బకు శల్యుడూ, దుశ్యాసనుడు కూడా స్పృహ తప్పిపోయారు. వెనకాలే వస్తున్న పాండవులకు హఠాత్తుగా సైంధవుడు అడ్డు తగిలాడు. యుద్ధంలో పాండవ సైన్యం మొత్తాన్ని (అర్జునున్ని మినహా) ఇతను ఒకరోజు మొత్తం నిలువరించగలడు. పరమేశ్వరుడి నుంచి ఈ వరం పొందాడు. సైంధవుడి అస్త్రాలను తట్టుకోలేక పాండవ సైన్యం పారిపోయింది. ఇటువైపు అభిమన్యుడు వీరోచిత యుద్ధంతో దుర్యోధనుణ్ణే పారిపోయేట్టు చేశాడు. అంతేకాదు, అతని కొడుకైన లక్ష్మణ కుమారుడిని, కోసల దేశరాజు బృహద్బలుణ్ణీ అంతం చేశాడు. అలా పద్మవ్యూహాన్ని పటాపంచలు చేసేలా కదులుతున్నాడు.
అందరూ ఒక్కటై, మోసగించి :
వీర విహారం చేస్తున్న అభిమన్యుడిని మోసంతో తప్ప అడ్డుకోలేమని ద్రోణుడు గుర్తించాడు. యుద్ధనీతి ప్రకారం ఒకరితో ఒకరు మాత్రమే, అది కూడా ఎదురెదురుగా పోరాడాలి. కానీ, కౌరవులు యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై మూకుమ్మడిగా దాడిచేశారు. బాణాల వర్షం కురపించారు. అప్పుడు అభిమన్యుడు చక్రాయుధాన్ని అందుకున్నాడు. చుట్టు ముట్టి దాన్నీ ముక్కలు చేశారు. అయినా వెరవకుండా గదాయుధం చేతబట్టి పోరు సాగించాడు. ఇంతలో ఎదురైన దుశ్శాసనుని కుమారుడితో ఘోర సమరం చేశాడు. ఇద్దరి ఒంటి నుంచి రక్తం ధార కట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ ప్రాణాలు విడిచారు.
అభిమన్యుడికి ఎలా తెలుసు?
పద్మవ్యూహంలో ప్రవేశం గురించి అభిమన్యుడి తల్లి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగిందట. అప్పటికే అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. ఈ వ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా, సుభద్ర "ఊ కొడుతూ" ఉంది. కాసేపటి తర్వాత సుభద్ర నిద్రలోకి జారుకుంది. గమనించకుండా అర్జునుడూ చెబుతూ పోయాడు. గర్భంలో ఉన్న అభిమన్యుడు వింటూ "ఊ కొట్టడం" మొదలు పెట్టాడట. పద్మవ్యూహాంలో ఉండే 7 వలయాల్లో ఉండే గజ వధ ద్వారా లోపలికి వెళ్లొచ్చని అర్జునుడు చెప్పాడు. సుభద్ర నిద్రపోతున్న విషయం గమనించి, అక్కడితో చెప్పడం ఆపేశాడట. అలా, లోనికి వెళ్లడం వరకు మాత్రమే అభిమన్యుడు తెలుసుకున్నాడు.