Republic Day 2025 Flag Hoisting : గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
VIDEO | President of India Droupadi Murmu unfurls national flag at Kartavya Path. #RepublicDay #RepublicDayParade #RepublicDayWithPTI pic.twitter.com/fN2GYlhkeO
— Press Trust of India (@PTI_News) January 26, 2025
ఈ ఏడాది స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శించారు.
సైనిక అమరవీరులకు మోదీ నివాళి
76వ రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకొని దిల్లీలో ప్రధాని నరేద్రమోదీ సైనిక అమరవీరులకు నివాళి అర్పించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధదళాల అధిపతులతో కలిసి ఇండియా గేట్ సమీపంలోని జాతీయ యుద్ధస్మారకం వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వాగతం పలికారు. అమరవీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించిన ప్రధాని మోదీ ఆ తర్వాత సైనికవందనం స్వీకరించారు. అమరులకు రెండునిమిషాలు మౌనం పాటించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన అనంతరం ప్రధాని మోదీ కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు.
VIDEO | Republic Day 2025: PM Modi (@narendramodi) lays wreath to martyrs at the National War Memorial in Delhi.
— Press Trust of India (@PTI_News) January 26, 2025
(Source: Third party)#RepublicDayWithPTI #RepublicDay2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/muu84mL4fB
మహానుభావులకు శిరస్సు వంచి ప్రణామం
అంతకుముందు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోదీ. మన ప్రయాణం ప్రజాస్వామ్య పద్ధతిలో, గౌరవంగా, ఐక్యంగా సాగేలా రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ ఆశయాల పరిరక్షణకు, బలమైన, సుసంపన్న భారతావనిని నిర్మించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ఈ వేడుక బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.