Governor Abdul Nazeer Republic Day Speech 2025 : గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్రప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను ఆయన వీక్షించారు. పరిశ్రమలు, పర్యాటక, సెర్ప్, గృహనిర్మాణ శాఖ , పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ శకటాలు ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా ఆరోగ్యశాఖ, మహిళాశిశు సంక్షేమం, జలవనరుల శాఖ, అటవీ, వ్యవసాయ, మత్స్య శాఖ , ఏపీసీఆర్‌డీఏ, పంచాయతీరాజ్, ఇంధనశాఖ ఉద్యాన, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, ఆర్‌టీజీఎస్ శకటాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏడు నెలల క్రితం ఏపీ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వివరించారు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినట్లు చెప్పారు. నిలిచిపోయిన ప్రాజెక్టులు, విచ్ఛిన్నమైన పాలనా వ్యవస్థతో ఏపీ సర్కార్‌పై భారం పడిందని తెలిపారు. ఈ గందరగోళం మధ్య, ఇటీవల జరిగిన సార్వత్రిక , ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పును అందించారని గవర్నర్ వెల్లడించారు.
"సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం దూరదృష్టి గల నాయకత్వం మార్గదర్శకత్వంలో నడుస్తోంది. గత పాలనలో దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మన నైతిక కర్తవ్యం. మా సర్కార్ ఏడు శ్వేతపత్రాలు విడుదల చేసి వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలియజేశాం. ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక అవరోధాలను అధిగమించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తోంది." - జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్
'రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తోంది. నిధులు విడుదల చేయడం వల్ల అమరావతి రాజధాని నగరంలోని నిలిచిపోయిన పనులను పునరుద్ధరించింది. పతనావస్థలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పునరుద్ధరించింది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువచ్చింది. కేంద్రం సహకారంతో రాష్ట్ర ఆర్థిక స్థితిని స్థిరీకరించే దిశగా సర్కార్ కృషి చేస్తోంది' అని గవర్నర్ తెలిపారు.
Governor on AP Development : ఏపీని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రోడ్‌మ్యాప్‌ను రూపొందించిందని గవర్నర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష వికసిత్ భారత్ నెరవేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనంద కరమైన ఆంధ్రప్రదేశ్‌ని రూపొందించడమే లక్ష్యమని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం పది మార్గదర్శక సూత్రాలు రూపొందించామని వివరించారు.
"స్వర్ణాంధ్ర 2047 మన గణతంత్ర స్ఫూర్తి, మన కలలను ప్రతిబింబిస్తుంది. స్వర్ణాంధ్ర 2047 కోసం రూపొందించిన పది సూత్రాలు మన రాష్ట్ర పరివర్తనలో కీలకమైన పరిణామం. పేదరికం లేని ఆంధ్ర ప్రదేశ్‌ను రూపొందించడమే లక్ష్యం. రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానించడానికి అపార తీరప్రాంతం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది రాష్ట్రాన్ని గేట్‌వేగా మారుస్తుంది. రాష్ట్రంలో పేదరికం సున్నా చేయడమే ప్రభుత్వ లక్ష్యం." - జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్
'ప్రభుత్వం వచ్చాక నెలవారీ పెన్షన్‌ను 3000ల నుంచి 4000లకి పెంచాం. అందరికీ ఇళ్లు, దీపం 2.0 సహా ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం. పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పూర్తి చేస్తూ, మా సర్కార్ 'జీరో పావర్టీ-పీ4 పాలసీని మరింత ముందుకు తీసుకువస్తోంది. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓబీసీలు, మహిళలు సంక్షేమం, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.' అని జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు.
సమ్మిళిత వృద్ధి, సహా బలమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధిని పెంపొందింపజేస్తామని గవర్నర్ తెలిపారు. సమీప భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులు రాబట్టేందుకు నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం (4.0) రూపొందించి అమలు చేస్తున్నట్లు వివరించారు.
Chandrababu Hoists Flag in Undavalli : మరోవైపు ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గణతంత్ర వేడుకలను నిర్వహించారు. గాంధీజీ, అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళి అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుల త్యాగాలను మరోసారి స్మరించుకుందామని వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర విజన్ సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు.
చంద్రబాబు విజనరీ నాయకుడు- ఏపీ అభివృద్ధికి పాటుపడ్డారు: గవర్నర్ - Governor Speech in AP Assembly